మళ్లీ రెచ్చిపోయిన సర్పంచ్ నవ్య.. MLA రాజయ్య రియాక్షన్ ఇదే!

by GSrikanth |
మళ్లీ రెచ్చిపోయిన సర్పంచ్ నవ్య.. MLA రాజయ్య రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య త‌న‌ను లైగింకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం జానకీపురం సర్పంచ్ నవ్య ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. అనంతరం సర్పంచ్‌తో పాటు గ్రామంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్య మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే సమక్షంలోనే మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. తాను చేసిన ఆరోపణలన్నీ నిజమే అని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ‘తాటతీస్త’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడే కాదు.. సమాజంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని సర్పంచ్ మండిపడ్డారు.

అనంతరం ఎమ్మెల్యే రాజయ్య స్పందిస్తూ.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ గ్రామం పట్ల వివక్ష చూపలేదని అన్నారు. మహిళలు వారి హక్కులు సాధించుకోవడానికి వందశాతం కృషి చేయాలని అన్నారు. దానికి తన తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ‘నా ఊపిరి ఉన్నంతవరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తా’ అని అన్నారు. తన వల్ల ఎవరికైనా బాధ, ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నా అని చెప్పారు. జానకీపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, తక్షణమే గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed