పాలకవర్గం Vs ప్రతిపక్షం.. ఉభయసభల్లో టగ్ ఆఫ్ వార్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-17 02:25:35.0  )
పాలకవర్గం Vs ప్రతిపక్షం.. ఉభయసభల్లో టగ్ ఆఫ్ వార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చాలా ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరిగాయి. అసెంబ్లీలో పాలక వర్గం వర్సెస్ ప్రతిపక్షం మధ్య గట్టి ఫైట్ కనిపించింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఇరు సభల్లోనూ టగ్ ఆఫ్ వార్‌గా చర్చలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ అసెంబ్లీ, మండలి సభలు ఇంట్రెస్టింగ్‌గా జరిగాయని స్వయంగా పలువురు సభ్యులే చెప్పడం గమనార్హం. గత పదేళ్ల పాలనలోని తప్పిదాలు, నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ ఇరు సభల ముందు ఉంచగా, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పాత స్టోరీలను రిపీట్ చేసింది. అసెంబ్లీ, మండలిలోనూ ఇదే ధోరణి కనిపించింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తప్పిదాలపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించగా, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వివిధ అంశాలపై నిర్లక్ష్యం జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. ఇలా పరస్పరం విమర్శల పర్వం కొనసాగిస్తూ చట్టసభలు హాట్‌హాట్‌గా జరిగేందుకు చొరవ చూపారు. ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు తాము పరిపాలించామనే అంశాన్ని మర్చిపోయిన బీఆర్ఎస్.. మళ్లీ గత కాంగ్రెస్ పాలన అంశాలను పునరావృతం చేస్తూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం గమనార్హం. మొదటి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ఆశించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వలేదు. ప్రతిపక్షాల వాయిస్ వినిపించాలనే వైఖరినే కాంగ్రెస్ ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపించింది.

గవర్నర్ ప్రసంగంపై అబ్జక్షన్స్..

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే మోషన్‌లో భాగంగా అధికార పార్టీ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేయగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రసంగంలో అన్ని నిజాలే ఉన్నాయని కాంగ్రెస్ వాదించగా, కల్పితాలు సృష్టించి తమ పాలనపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇదే క్రమంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇక కౌన్సిల్‌లో జీవన్‌రెడ్డి వర్సెస్ తాతా మధు, మధుసుధనాచారి, కవితల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రెండు సభల్లోనూ ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగగా, గడిచిన పదేళ్లలో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వనందున అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా జరగలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

వాళ్లు పదేళ్ల పాలనపై.. వీళ్లు పాత పాలనపై

గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఫెయిల్, రైతుల సమస్యల పరిష్కారంలో విఫలం అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. అవసరం కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్నారని, కాళేశ్వరంలో అవినీతి, సివిల్ సప్లై, విద్యుత్, ఎడ్యుకేషన్‌లో వైఫల్యం, టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం, నిర్బంధ పాలన, ప్రజాసంఘాలు, మీడియా గొంతు నొక్కడం, పేదలను కాదని కార్పొరేట్లకు పెద్దపీఠ వేయడం, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, కబ్జాలు, గడీల పాలన, రైతులకు బేడీలు, నేరేళ్ల ఇసుక మాఫియా హత్యలు వంటి తదితర అంశాలపై ఇరు సభల్లో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ విమర్శలు కురిపించింది.

కాగా బీఆర్ఎస్ సరైన వాదనలతో ఖండించకుండా 1956 నుంచి కాంగ్రెస్ పాలనలో ఎన్నో సమస్యలు వచ్చాయని దాటవేసే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ వచ్చిందని, ఫ్లోరోసిస్ సమస్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యంతో విద్యార్థులు అమరులు అయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. దీంతో పాటు పదేళ్లలో జరగని లాకప్ డెత్ తాజాగా నల్లగొండ జిల్లాతో మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయన్ని పెంచామన్నారు. పదేపదే ప్రత్యేక తెలంగాణ కంటే ముందున్న పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ నొక్కి చెప్పింది. బీఆర్ఎస్ పదేళ్ల నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తూనే, భవిష్యత్ ప్రణాళికను వివరించగా, బీఆర్ఎస్ మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం విచిత్రంగా కనిపించింది.

Advertisement

Next Story