TSPSC పేపర్ లీకేజీ కేసులో కనిపించని పురోగతి.. కేసీఆర్‌పై RSP సీరియస్

by GSrikanth |
TSPSC పేపర్ లీకేజీ కేసులో కనిపించని పురోగతి.. కేసీఆర్‌పై RSP సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో నెల రోజులు గడిచినా కేసులో పురోగతి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి లీకేజీ అంశంపై ముఖం చాటేస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసులో సిట్ అధికారులు 18 మంది నిందితులను అరెస్టు చేసినట్టే చేసి, వారికి ఏం కాకుండా భద్రంగా పూవుల్లో పెట్టి చూసుకుంటున్నారని విమర్శించారు. లీకేజీ కేసులో ప్రముఖుల మీద పీడి యాక్టు కింద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని నిలదీశారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ మీద ప్రత్యేక కేసును ఎందుకు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు.

గురువారం బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసే సిట్.. పనిచేయలేక కూలబడిందని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాసి రెండేళ్లు దాటినా ఫలితాలు ఇవ్వకపోవడంతో, విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ విద్యార్థులు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలుద్దామంటే, కార్యాలయంలోనికి విద్యార్థులకు అనుమతి లభించడం లేదని ఆరోపించారు. కనీసం విద్యాశాఖ మంత్రి అయినా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామకాల్లో సింగిల్ పిజి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.కేవలం హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇచ్చి,మిగతా అభ్యర్థులకు అర్హత లేదనడం అన్యాయం అన్నారు. విద్యాశాఖ మంత్రి స్పందించి సింగిల్ పిజి గెలిచిన అభ్యర్థులందరికీ నోటిఫికేషన్‌లో అర్హత కల్పించి పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story