మిషన్ భగీరథ విభాగానికి రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు.. ఆ ప్రాజెక్టుల నీళ్లు కూడా..

by Ramesh N |
మిషన్ భగీరథ విభాగానికి రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు.. ఆ ప్రాజెక్టుల నీళ్లు కూడా..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్ర మంతటికీ నీళ్లు ఇవ్వడం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్ లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలన్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించారు.

తాగునీటి నిర్వహణ విధులు సర్పంచులకే..

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంటింటికి నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ మాత్రమే విడిగా సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేదని అధికారులు వివరణ ఇచ్చారు.

జల జీవన్ మిషన్ నిధులు రావడం లేదు

వందకు వంద శాతం తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు వీలున్న జల జీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందడం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. జల జీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story