రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అనలేదు.. హరీశ్ రావు ఫైర్

by Ramesh N |   ( Updated:2024-06-03 10:22:10.0  )
రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అనలేదు.. హరీశ్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావొచ్చు, సీఎం కావొచ్చు, కానీ ఉద్యమకారుడు కాలేడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో పై భాగంలో జై తెలంగాణ, జై జై తెలంగాణ కచ్చితంగా ఉండేదని గుర్తు చేశారు. నాడు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేదించారని, ఇప్పుడు సీఎం రేవంత్ పాలనతో తెలంగాణ పదం మాయమైందని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు తప్ప ఉద్యమకారుడు కాలేడని విమర్శించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ఉద్యమకారులన్న ఘనత తమకు దక్కుతుందన్నారు. కరెంట్ కోసం రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశామని, ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులేనని, మన సిద్దిపేట మట్టిబిడ్డలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడిన సిద్దిపేట జిల్లా వాసులను గౌరవించుకోవడం మన బాధ్యత అని అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అవతరణ ఉత్సవాలను మూడు రోజులు జరిపినట్లు స్పష్టంచేశారు.

Advertisement

Next Story