వరదలో చిక్కుకున్న 1200 మంది మోరంచపల్లి గ్రామస్తులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 16:23:09.0  )
వరదలో చిక్కుకున్న 1200 మంది మోరంచపల్లి గ్రామస్తులు (వీడియో)
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమట్ల మండ‌లం మోరంచ‌ప‌ల్లి గ్రామం వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది. గ్రామానికి స‌మీపంలోకి వాగుకు వ‌ర‌ద నీరు పోటెత్తడంతో గ్రామంలోకి వ‌ర‌ద నీరు దారి మ‌ళ్లింది. బుధ‌వారం అర్ధరాత్రి త‌ర్వాత గ్రామంలోకి అక‌స్మాత్తుగా వ‌ర‌ద నీరు రావ‌డంతో గ్రామ ప్రజలంతా వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయారు. గ్రామం మీదుగా ఇసుక ర‌వాణా చేస్తున్న దాదాపు 12 లారీల డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు కూడా చిక్కుకుపోయారు. వ‌ర‌ద నీరు అక‌స్మాత్తుగా గ్రామంలోకి చొచ్చుకురావ‌డంతో ప్రజలంతా ఇళ్ల పైక‌ప్పుల మీద‌కు చేరుకుని ర‌క్షించండ‌ని ఏడుస్తున్న దృశ్యాలు క‌నిపిస్తున్నాయి.

గ్రామంలోని 1200 వంద‌ల మందికి పైగా వ‌ర‌ద‌ల్లో ఉండిపోయారు., ఇప్పటి వ‌ర‌కు ముగ్గురు వ‌ర‌ద‌ల్లో కొట్టుక‌పోయిన‌ట్లుగా స‌మాచారం అందుతోంది. గ్రామంలో విద్యుత్ స‌ర‌ఫరా నిలిచ‌పోవ‌డంతో పాటు అర్ధరాత్రి స‌మ‌యంలో వ‌ర‌ద బీభ‌త్సంతో ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ కొట్టుకుపోయాయ‌ని తెలిపారు. క‌ట్టుబ‌ట్టలతో మిగిలామ‌ని విల‌పిస్తున్నారు. గ్రామం చుట్టూ వ‌ర‌ద చేరుకోవ‌డం, అత్యంత ప్రమాద‌క‌ర స్థాయిలో ప్రవాహం కొన‌సాగుతుండ‌టంతో పోలీసులు సైతం వెళ్లలేని ప‌రిస్థితి నెలకొంది.

విష‌యం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రులు ఎర్రబెల్లి, స‌త్యవతి రాథోడ్ ప‌రిస్థితిని స్వయంగా ప‌ర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజల‌ను ర‌క్షించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే చాలా మంది చ‌నిపోయిన‌ట్లుగా గ్రామ‌స్థులు ఏడుస్తూ మీడియా ప్రతినిధుల‌కు కాల్ చేసి చెబుతున్నారు. గ్రామంలో అత్యంత భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మ‌రికొద్దిసేప‌ట్లో గ్రామానికి చేరుకోనున్నాయి. అయితే గంట‌ గంట‌కు వ‌ర‌ద ప్రవాహం పెరుగుతుండ‌టంతో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisement

Next Story