- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ జిల్లాల్లో ఆకాశాన్నంటిన ‘రియల్’ దందా.. ‘నీమ్స్ బోరో గ్రూపు’ చోళ కళా నైపుణ్యం భేష్!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం లాభాల బాటన నడుస్తున్నది. అందుకే ఎక్కడెక్కడి వారో ఇక్కడికొచ్చి కంపెనీలు పెడుతున్నారు. పైగా వందలు, వేల ఎకరాలను రైతుల దగ్గర అగ్గువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మేసి రూ.కోట్లు మూటగట్టుకుంటున్నారు. రైతులకేమో రూ.లక్షల్లో ఇస్తూ వీళ్లేమో రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. పైగా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొడుతున్నారు. విల్లా ప్లాట్లు, ఫామ్ ప్లాట్లు అంటూ అద్భుత దీపాలను వెలిగిస్తున్నారు. కస్టమర్లను బుట్టలో వేసుకునేందుకు త్రీ డి సినిమాలు చూపిస్తున్నారు. అందమైన బ్రోచర్లు కొట్టి ప్లాట్లను కొనుగోలు చేసేటట్లుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పది, 20 ఎకరాలకు మాత్రమే డీటీసీపీ అనుమతులు తీసుకుంటున్నారు. మార్కెట్లో మాత్రం 100, 200.. 500 ఎకరాల్లో భారీ ప్రాజెక్టులంటూ బ్రోచర్లను ముద్రించి అమ్మేస్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్లు అంటూ గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, డీటీసీపీ శాఖల సహకారంతో యథేచ్చగా వందల ఎకరాలను అమ్మేస్తున్నారు.
ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ దందా ఆకాశాన్నంటింది. బడా బడా కంపెనీలు.. వారి బ్రాండ్ ఇమేజ్ ని సొమ్ము చేసుకునేందుకు అనుమతులు లేకుండానే ప్లాట్ల దందా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కోవలో నీమ్స్ బోరో ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 1700 ఎకరాలకు పైగా ల్యాండ్ ని సేల్ కి పెట్టింది. అన్నీ డీటీసీపీ, రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులంటూ జనాన్ని మభ్యపెడుతున్నది. ఎన్ని ఎకరాలకు అనుమతులు తీసుకున్నారో కూడా ఎక్కడ చెప్పకుండా డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ వందల ఎకరాల్లో చేపట్టామంటూ విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు స్థలంపై మీ పెట్టుబడి భవిష్యత్తు తరాలకి కచ్చితమైన రాబడిగా మారుతుంది. మన జీవనశైలి ప్రకృతిలో మమేకం. ప్రశాంతతకి ప్రతిరూపం.. అంటూ అందమైన బ్రోచర్లతో సోషల్ మీడియా, వాట్సాప్ ల ద్వారా కస్టమర్లను ఆశ్రయిస్తున్నారు. వాటిని చూడగానే బాహుబలి సినిమా కంటే అందంగా ఉండడంతో కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు.
ఎన్ని ఎకరాలకు అనుమతి?
నీమ్స్ బోరో కంపెనీ(Neemsboro Estates private limited) చేపట్టిన ప్రాజెక్టులు ఎన్ని? ఎంత విస్తీర్ణంలో లే అవుట్లు వేశారు? ఎక్కడి అనుమతి పత్రాలు? ఎంత విస్తీర్ణానికి పర్మిషన్లు తీసుకున్నారు? మార్కెట్లో అమ్మకానికి పెట్టిన విస్తీర్ణం ఎంత? ఒక ఊరిలో వెంచర్ కి అనుమతి పొంది అదే సర్టిఫికేట్లను అన్ని ప్రాజెక్టులకు చూపిస్తున్నారు. బ్రోచర్లలో చూపిస్తున్న వందలాది ఎకరాలకు డీటీసీపీ, రెరా అనుమతులు లభించాయా? అన్నింటికీ అనుమతులు ఉన్నాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సుమారు 1700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచర్లు చేసి అమ్మేశారు. మరి ఒకటీ రెండింటికి మినహా మరే వెంచర్ లోనూ డీటీసీపీ నంబర్లు మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. ప్రచారంలో రెరా, డీటీసీపీ నంబర్లు, అనుమతి ప్రతాలను ఎందుకు చూపించడం లేదో అర్ధం కావడం లేదని కస్టమర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో చోట 100 ఎకరాలకు తగ్గకుండా ప్రాజెక్టును చేపట్టారు. మరి అంత విస్తీర్ణానికి డీటీసీపీ అనుమతులు ఇచ్చినప్పుడు సదరు ఆధారాలు బ్రోచర్లలో ఎందుకు ముద్రించడం లేదో కంపెనీ స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వీటికి ఉన్నాయా?
– నారాయణఖేడ్ లో 300 ఎకరాల్లో ‘మన ఊరు’ పేరిట ప్రాజెక్టును చేపట్టారు. ఇది డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఇందులో 33, 40, 60 ఫీట్ల రోడ్లు వేశామంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, చిల్ట్రన్ ప్లే ఏరియాస్, మోడరన్ ఎమినిటీస్ ఏర్పాటు చేశామంటున్నారు. అలాగే క్లబ్ హౌజ్ కూడా నిర్మించామంటున్నారు. మరి ఈ నిర్మాణానికి అనుమతులు ఎవరిచ్చారో వాళ్లే చెప్పాలి.
– కొహిర్ క్రాస్ రోడ్డులో 200 ఎకరాల డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఐతే ఎక్కడా నంబర్ మాత్రం లేదు. పైగా క్రెడాయ్ మెంబర్ అంటూ గొప్పగా చెప్పారు. ఆ ప్రాజెక్టు పేరు కూడా RajaDhani.. A new capital for next Generation గా నామకరణం చేశారు. వెబ్ సైట్ లో రాజధాని బియాండ్ ది యూజువల్ లైఫ్ స్టయిల్ ప్రాజెక్టు అన్నారు. ఇది కూడా డీటీసీపీ అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. ఆ బ్రోచర్ చూస్తే ఈ క్షణమే కొనేయ్యాలనంతగా డిజైన్ చేశారు. ఆర్చ్ ఓ రాజభవనానికి ఉన్నట్లుగా చూపించారు. ఏనుగులు, బాహుబలి సెట్టింగుల్లోని పిల్లర్లు, కిరీటాలు, సింహాసనాలు, ప్రపంచమే ఆశ్చర్యపోయే సేవలందిస్తామంటున్నారు. క్లబ్ హౌజ్, ఆర్చ్, బార్బ్డ్ వైరింగ్, కర్బింగ్ స్టోన్స్, వాటర్ స్టోరేజీ సిస్టం, 33, 40, 60 ఫీట్ల తారు రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం.. ఇలా అనేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆఖరికి 2025 డిసెంబరు 31 వరకు మామిడి చెట్లను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. అదేంటి? ప్లాట్లు అన్నారు కదా.. ఇప్పుడు మామిడిచెట్ల దగ్గరికి టాపిక్ ఎందుకొచ్చిందో నీమ్స్ బోరో వాళ్లకే తెలియాలి. ఇల్లు కట్టుకునే ప్లాట్ లో మామిడిచెట్లు ఎందుకు పెంచుతారో వారే చెప్పాలి. అలాగే రాజధాని పేరిట ఝరాసంగం మండలం చిల్కెపల్లిలో మాత్రం సర్వే నం.106, 107, 108, 120 ల్లో కేవలం 26 ఎకరాలకు డీటీసీపీ అనుమతులు తీసుకున్నారు. ఇది చూపించి మొత్తం లే అవుట్ కి అనుమతులు ఉన్నట్లుగా వినియోగదారులను మభ్యపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– నారాయణఖేడ్ లో మెగా 320 ఎకరాల డీటీసీపీ ప్రాజెక్టు. ఇది కూడా మన ఊరు అనే పేరుతోనే ఉన్నది. ఇది టీడీసీపీ అప్రూవ్డ్ అని పేర్కొన్నారు. ఎక్కడా నంబరు లేదు.
– భరణి ఎవెన్యూస్ పేరిట జహీరాబాద్లో హైదరాబాద్– ముంబాయి హైవే మీదనే 100 ఎకరాల్లో డీటీసీపీ లే అవుట్ వేసినట్లు ప్రచారం చేస్తున్నారు. గజం రూ.6 వేలుగా పెట్టారు. ఇక్కడ కూడా డీటీసీపీ నంబరు మాత్రం పేర్కొనలేదు.
– నాగలగిద్ద మండలం ముక్తాపూర్ సర్వే నం.12, 26ల్లో 105 ఎకరాల్లో మన ఊరు పేరిట వేసిన లే అవుట్ కి ఎలాంటి అనుమతులు ఉన్నాయో పేర్కొనలేదు. కానీ ప్రపోజ్డ్ లే అవుట్ అంటూ ప్రచారం చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఏకంగా 1193 ప్లాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
– చేవెళ్లలో పమేనా గ్రీన్స్ ఇన్విటేషన్ ఫర్ ఫామ్ లవర్స్ పేరిట 100 ఎకరాల వెంచర్ వేసి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అలాగే ఆక్సిరిడ్జ్ పామ్స్ పేరిట నారాయణఖేడ్ లో 250 ఎకరాల ప్రాజెక్టును పూర్తి చేశారు. నేచర్ ఉడ్స్ పేరిట నారాయణఖేడ్ లోనే 100 ఎకరాల ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టును కంప్లీట్ చేశామని పేర్కొన్నారు.
ఆర్భాటం నీమ్స్ బోరో
నీమ్స్ బోరో గ్రూపు ఉడ్ ల్యాండ్స్ పేరిట 500 ఎకరాల ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు అంటూ ప్రచారం. కంగ్టిలోనే ఉన్నదంటూ ఆర్భాటం. 5 గుంటలకు రూ.5 లక్షలు. 12 ఏండ్లు పాటు కంపెనీయే మెయింటెయిన్ చేస్తుంది. 30 ఫీట్ల రోడ్లకైతే రూ.25 వేలు అదనంగా చెల్లించాలి. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కైతే రూ.50 వేలు అదనం. తూర్పు దిక్కునుండే ప్లాట్ కి రూ.5 వేలు అదనంగా చెల్లించాలంటున్నారు. మన ఊరు ప్రాజెక్టు డీటీసీపీ, రెరా అప్రూవ్ చేసింది. తాటికాయంత అక్షరాలతో బ్రోచర్లు ముద్రించారు. కానీ ఆ నంబర్లు మాత్రం పేర్కొనడం లేదు. ఆరు లక్షలకే 165 గజాల ప్లాట్ అంటూ ప్రచారం. సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలం ముక్తాపూర్ సర్వే నం.66, 67, 68ల్లోనూ 47 ఎకరాల్లో లే అవుట్ వేశారు. అక్కడ కూడా ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. కస్టమర్ల ఎవరైనా అడిగితే ఇక్కడ డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్ లోని సేల్ డీడ్స్ ని షేర్ చేస్తున్నారు.
వీటి సంగతి ఏంటి?
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్తాలో సర్వే నం.48, 55, 56, 57, 58, 59, 60, 61, బోర్గిలో సర్వే నం.90, 91, 87, 88, 89, 95, 83, 79.. మొత్తం 374.34 ఎకరాల్లో భారీ వెంచర్ వేశారు. ఐతే చాప్తాలో సర్వే నం.48, 55 ల్లో కొన్ని ప్రాపర్టీస్ పీవోబీలో ఉన్నాయి. బోర్గిలో సర్వే నం.89, 90, 95 లో పాటిల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. వాటిని కూడా నీమ్స్ బోరో కంపెనీదిగా లే అవుట్లలో చూపిస్తున్నారు. వందలాది ఎకరాల్లో లే అవుట్లు చేసినప్పుడు మధ్యలో కొత్త కంపెనీల పేరిట భూములు ఎందుకు ఉన్నాయో అర్ధం కావడం లేదు. అలాగే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో కొన్ని సర్వే నంబర్లు కనిపిస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది.