రూ.50 కోట్ల విలువైన భూమిపై ‘రియల్’ కన్ను.. తెర వెనుక ప్రజాప్రతినిధులు!

by GSrikanth |
రూ.50 కోట్ల విలువైన భూమిపై ‘రియల్’ కన్ను.. తెర వెనుక ప్రజాప్రతినిధులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఎంతో విలువైన భూమి. చుట్టూ లే అవుట్లు. తూర్పున మరో గచ్ఛిబౌలిగా రూపాంతరం చెందుతుందంటూ బడా రియల్ ఎస్టేట్ సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాంటి చోట 17.30 ఎకరాల భూమిపై పెద్ద చర్చ నడుస్తున్నది. ఎకరం రూ.3 కోట్ల వరకు పలికే.. రూ.50 కోట్ల విలువైన ఈ భూమి క్లాసిఫికేషన్ పై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికీ అది భూదాన్ భూమిగా రికార్డుల్లో నమోదై ఉన్నది. కానీ దాన్ని పట్టా భూమిగా మార్చేందుకు పావులు చకచకా కదులుతున్నాయి. కొన్ని రోజుల్లోనే పీవోబీ జాబితా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడిపల్లి సర్వే నం.692లోని ఈ భూమిపై పేచీని తొలగించేందుకు ఉన్నత స్థాయి పైరవీ సాగుతున్నది. గతంలో పని చేసిన అధికారులెవరూ క్లాసిఫికేషన్ మార్చేందుకు సాహసం చేయలేదు.

తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫైళ్లు క్లియర్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. భూదాన్ భూమిగా ఉంటే రక్షించాల్సిన అధికారులు క్లియరెన్స్ కి మొగ్గు చూపించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. ఇంతకీ అది భూ దాన్ భూమియా? పట్టా భూమియా? అన్నది సందేహం కలుగుతున్నది. కొందరేమో తాము తెలియక కొనుగోలు చేశామని అంటున్నారు. ఇంకొందరేమో భూదాన పత్రం నకిలీదని, పొరపాటుగా రెవెన్యూ రికార్డుల్లో చేరిందంటున్నారు. కానీ 1952 తర్వాతి రెవెన్యూ రికార్డుల్లో భూదాన్ భూమిగా కొనసాగినట్లు స్పష్టంగా ఉన్నది. అలాంటప్పుడు పట్టా భూమి అని క్లాసిఫికేషన్ మార్పు ఎలా చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పటి దాత ఇచ్చిన భూదాన పత్రాన్ని నకిలీ అని రుజువు చేశారా? అసలు భూదానం చేయలేదా? భూముల ధరలు అమాంతంగా రూ.కోట్లు పలుకుతున్న తరుణంలో నకిలీగా మారిందా? ఈ అంశాలపై క్లారిటీ లేకుండానే రూ.కోట్ల విలువైన భూమిపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులు తొందరపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దానపత్రం ఉందిగా..

భూదాన యజ్ఞ సమితికి ఆచార్య వినోభాజీ భూదాన యజ్ఞంలో భాగంగా అప్పటి రామన్నపేట తాలుకాలోని తంగడిపల్లి (చౌటుప్పల్ మండలం)లో సర్వే నం.692 లో 17.30 ఎకరాలు దానపత్రం ఇచ్చినట్లుగా ఉన్నది. 1952 నవంబరు 10న పంపిణీ పత్రం రికార్డుల్లో ఉన్నది. ఐతే ఇది ఒరిజినలా? డూప్లికేటా? అన్న సందేహాలను లేవనెత్తారు. పైగా ఆనాటి నుంచి 1980 వరకు కూడా పహాణీల్లో భూదాన భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లోనూ ఈ భూమి పీవోబీ (ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్) జాబితాలో పేర్కొన్నారు. ఎలాంటి క్రయ విక్రయాలు చేయరాదంటూ చౌటుప్పల్ తహశీల్దార్ లేఖ నం.బి/6404/2006, తేదీ.27.02.2006 జారీ చేశారు. అందులోనూ భూదాన్ భూమి అంటూ పేర్కొన్నారు. నకిలీ పత్రమైతే ఆనాటి నుంచి రికార్డుల్లో కొనసాగింపునకు కారణమెవరు? పట్టాదారులు, ఆ భూమిని కొనుగోలు చేసిన పెద్దలు మార్పునకు ఎందుకు ప్రయత్నించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పత్రం లేదట..

రూ.50 కోట్ల విలువైన భూమిని పీవోబీ జాబితా నుంచి తొలగించాలంటూ దరఖాస్తులు అందాయి. సీసీఎల్ఏలోని భూదాన్ భూముల విభాగపు అధికారులు పరిశీలించి ఈ భూమికి సంబంధించిన దానపత్రమే లేదంటూ రెవెన్యూ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అట్లయితే ఇన్నాండ్లుగా ఏ పత్రాలు చూడకుండానే పీవోబీలో నమోదు చేసిన అధికారులెవరు? దాన్ని అలాగే కొనసాగింపునకు కారణమైన రెవెన్యూ అధికారులపై చర్యలు ఏం తీసుకున్నారు? అనేది పీవోబీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్న ఉన్నతాధికారులే స్పష్టత ఇవ్వాలి. దాని ఆధారంగానే క్లియరెన్స్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తంగడపల్లి సర్వే నం.692లోని 17.30 ఎకరాలు ముమ్మాటికీ భూదాన్ భూమి అని భూదాన్ యజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీసీఎల్ఏలోని భూదాన్ బోర్డు విభాగం వాళ్లు మాత్రం కాదంటుండడం గమనార్హం.

చుట్టూ అక్రమాలే!

ఈ ల్యాండ్ చుట్టూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ ఆధారాలతో సహా చెప్తున్నది. ప్రతి సర్వే నెంబర్ లో 48 ఎకరాల చొప్పున 692, 693, 700, 715, 716 సర్వేనెంబర్లలో అనధికార లే అవుట్లు వేసినట్లు చూపించారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన జి/5394/2019 ని జత చేయడం విశేషం. సర్వే నం.692లోని భూమి చుట్టూ అనధికార లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారని, వాటిపై క్రయ విక్రయాలను నిషేధించినట్లు అధికార యంత్రాంగం వెబ్ సైట్‌లోనే చూపించింది. ఈ భూములపైనా పేచీ కొనసాగుతుండడం విశేషం. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story