మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు రాష్ట్రానికి UK వైద్య బృందం.. చిన్నారికి అరుదైన సర్జరీ

by Satheesh |
మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు రాష్ట్రానికి UK వైద్య బృందం.. చిన్నారికి అరుదైన సర్జరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్ హాస్పిట‌ల్‌లో గ‌త నాలుగు రోజులుగా చిన్నారుల‌కు అరుదైన గుండె సర్జరీలు జ‌రుగుతున్నాయి. ఇప్పటి వరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్రత్యేక ఆహ్వానం మేర‌కు బ్రిట‌న్ నుంచి డాక్టర్​వెంకట ర‌మ‌ణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్స్ పరస్పర స‌హ‌కారంలో ఈ సర్జరీలు నిర్వహించారు. ప్రైవేటులో దాదాపు రూ.5 లక్షల ఖర్చయ్యే ఈ చికిత్సను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన నెల రోజుల వ‌య‌సున్న శిశువు (త‌ల్లి ఫాతిమా) ఇటీవ‌ల తీవ్ర హృద్రోగ సమస్యలతో నిమ్స్ ఆసుప‌త్రిలో చేరింది.

అప్పటికీ శిశువు బ‌రువు కేవ‌లం 2.5 కిలోలు. ఆర్టీరియ‌ల్ అనాట‌మీ, మ‌ల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్‌తో హాస్పిట‌ల్‌లో చేరింది. బ్రిట‌న్, నిమ్స్, నీలోఫ‌ర్ డాక్టర్లు పూర్తి స్థాయిలో పరిశీలించి, గ‌త నెల 28వ తేదీన శిశువుకు ఆర్టీరియ‌ల్ స్విచ్ రిపేయిర్‌, మ‌ల్టిపుల్ వీఎస్‌డీ క్లోజ‌ర్ సర్జరీను విజయ వంతంగా నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే మొదటి సారి అని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీ చేసి శిశువు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యుల‌ను ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అభినందించారు. బ్రిట‌న్ నుంచి ప్రత్యేక వైద్య బృందం నిమ్స్‌కు వచ్చి చిన్నారుల సర్జరీల్లో పాల్గొనడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story