నిబంధనలు పాటించని వేదాంతు విజ్ఞాన్

by Mahesh |
నిబంధనలు పాటించని వేదాంతు విజ్ఞాన్
X

దిశ, చైతన్యపురి : ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేసి పండుగ పూట కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. రంజాన్ పండుగ దినాన ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సెలవులిస్తున్నా హైదరాబాద్ నడిబొడ్డున కొత్తపేట ఏరియాలోని కోచింగ్ సెంటర్లు యథావిధిగా నిర్వహించడం సోమవారం దిశ కంటపడింది.

ఎక్కడ..

సరూర్‌నగర్ డివిజన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన హుడా కాలనీ రోహిత్‌గౌడ్ ఎస్టేట్‌లోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ నాలుగో అంతస్తు ప్లాట్ నంబర్ 106లో కొన్నేండ్లుగా వేదాంతు విజ్ఞాన్ పేరిట కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. విజ్ఞాన్ కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కై ఇక్కడ జేఈఈ అడ్వాన్సుడ్, నీట్, ఎంసెట్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 10 క్లాస్ రూములు ఏర్పాటు చేయగా 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి సుమారు లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. సెంటర్ యాజమాన్యం రంజాన్ పర్వదినాన సైతం సెలవు ఇవ్వకుండా సెంటర్ నిర్వహించారు.

బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం..

తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసినప్పుడే బజాజ్ ఫైనాన్స్ వెసులుబాటు ఉందని చెబుతున్నారు. ఆధార్ పాన్ కార్డులతో బజాజ్ ఫైనాన్స్ ఇప్పించి వేదాంత విజ్ఞాన్ కళాశాల యాజమాన్యం ఒకేసారి ఫీజు తీసేసుకుంటున్నారు. దీంతో సంస్థకు ఆదాయం సమకూరుతుండగా తల్లిదండ్రులకు ఈఎంఐల భారం పడుతోంది.

పేరెంట్స్ ఒత్తిడితోనే..

ఈరోజు సెలవు దినమని మాకు కూడా తెలుసు. మాది తప్పే. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడితోనే ప్రస్తుతం సోమవారం తరగతులు నిర్వహిస్తున్నామని కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీపూజ, అకడమిక్ అడ్మిన్ హెడ్ యతీశ్ తెలిపారు. వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడించాలని దిశ ప్రతినిధి కోరగా నీళ్లు నమిలారు. సంబంధిత అధికారులు సంస్థపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed