Modi Rice: రేషన్ షాపుల్లో ఇచ్చేది ప్రధాని మోడీ బియ్యమే! బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Ramesh N |
Modi Rice: రేషన్ షాపుల్లో ఇచ్చేది ప్రధాని మోడీ బియ్యమే! బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మొన్నటి నుంచి కాంగ్రెస్ ప్రారంభించిన సన్న బియ్యం పథకం.. ప్రధాని మోడీ (Modi) బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో మోడీ బియ్యం తీసుకోడానికి ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తుంటే.. మంది పెండ్లీ కి పోయి మంగళ హారతి పట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోడీ, కేంద్రం పేరు ప్రస్తావించకుండా వాళ్ల పథకంగా చిత్రీకరించారని ఆరోపించారు. బియ్యం పంపిణీ పథకంపై వీధి నాటకాలు వేసే వారికంటే కాంగ్రెస్ పార్టీల నేతలు అంతకు మించి నటిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని, పేరు చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎన్ని చెప్పుకున్నా.. అవి మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంత ఖర్చు చేసి పేదలకు ఉచితంగా మోడీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంటే.. కనీసం ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు? తక్షణమే రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అనే దానిపై రేషన్ షాపుల వద్ద డిస్ ప్లే చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్నవన్నీ ఊహగానాలేనని కొట్టి పారేశారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. హెచ్‌సీయూ వ్యవహారంపై బండిసంజయ్ స్పందించారు. హెచ్‌సీయూలో భూముల అంశంలో ఏబీవీపీ కార్యకర్త రోహిత్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు అతన్ని తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. అతను ఆరు రోజులుగా సంగారెడ్డి జైలులో ఉన్నారని చెప్పారు. రోహిత్ హెచ్‌సీయూ స్టూడెంట్, స్కాలర్ అని వివరించారు. చదువుకునే స్టూడెంట్.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలతో పోలీసులు అతని కేసు పెట్టి అరెస్ట్ చేశారని వెల్లడించారు.

ఇది రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గమైన చర్య అని అరెస్ట్‌ను ఖండించారు. వారి భూమి కోసం వారు అందోళనలు చేస్తే.. అనేక మంది విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టడంతో వారి భవిష్యత్తు ఏమిటని నిలదీశారు. వెంటనే హెచ్‌సీయూలో విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్ముకున్నారని, ఏకంగా రూ.50 వేల కోట్ల విలువ చేసే భూములను అమ్ముకునేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు.



Next Story

Most Viewed