ప్రైవేటు దోపిడీ.. అకడమిక్ ఇయర్ చివర్లోనే తల్లిదండ్రులకు టెన్షన్

by Kalyani |
ప్రైవేటు దోపిడీ.. అకడమిక్ ఇయర్ చివర్లోనే తల్లిదండ్రులకు టెన్షన్
X

దిశ, జహీరాబాద్: విద్యాశాఖ అధికారుల ఉదాసీనత, తల్లిదండ్రుల బలహీనతల కారణంగా ప్రైవేట్ స్కూళ్ల ప్రతినిధులు రెచ్చిపోతున్నారు. పాఠశాల ప్రారంభంలో పెట్టే టెన్షన్లన్నీ విద్యా సంవత్సరం చివర్లో పెడుతున్నారు. వారికి కావాల్సిన డబ్బుముందే రాబట్టేందుకు తెరలేపారు. అందుకు ప్రోగ్రెస్ ..కార్డును అడ్డం పెట్టుకుంటున్నారు. విద్యార్థులకు సంవత్సరం మొత్తం చదువు చెప్పిన పాఠశాలలో చివరగా పరీక్షలు పెట్టి ఫలితాలు విడుదల చేస్తారు. అందుకు సంబంధించి ప్రోగ్రెస్ కార్డు విద్యార్థుల చేతికిచ్చి సంతోషంగా ఇండ్లకు పంపి తల్లిదండ్రులకు చూపించేలా చేస్తారు. కానీ, ఈ సంవత్సరం వినూత్న రీతిలో విద్యార్థులకు సంతోషాలకు బుక్స్ కొనాలని మెలిక పెట్టారు.

ప్రోగ్రెస్ కార్డ్ చూడాలన్న తమ పిల్లల ఆసక్తి కోసం తల్లిదండ్రుల నుంచి వేల రూపాయల విలువైన బుక్స్ ను అంటగడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో సదరు విద్యార్థులు పాఠశాలకు రారన్న అనుమానం కారణంగానే వారు ఇలాంటి కన్నింగ్ బుద్ధి చూపిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, మరోవైపు వారి బోధన తీరుపై వారికి నమ్మకం లేకుండా పోతుందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే తల్లిదండ్రులు ఎందుకు ఈ పాఠశాల వదిలేస్తారని అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయమై మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులకు విన్నవించినా ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సదరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

స్థోమత ఉన్న కొందరి నుంచి..

స్థోమత ఉన్న కొందరు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బుక్స్ తో పాటు ఏకంగా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే వారు అనుసరిస్తున్న విధానాలపై అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలకు డిమాండ్

ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధం గా వచ్చే విద్యా సంవత్సరానికి ముందు గానే బుక్స్ అంటగడుతూ ఫీజులు వసూలు చేస్తున్న జహీరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్ డిమాండ్ చేశారు. వారికి తొత్తుగా మారిన విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. జహీరాబాద్ పట్టణంలో ఎలాంటి గుర్తింపు లేని స్కూల్ నెక్స్ట్ అకాడమీ ఇయర్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్స్, డ్రెస్సులు, షూస్ అమ్ముతున్నారని, ఇందుకు సంబంధించిన ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా తల్లిదండ్రుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు..ప్రైవేటు యాజమాన్యాల చేష్టలను చూసి చూడకుండా వదిలేస్తున్న ఎంఈఓలతో విద్యార్థుల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, అలాంటి అధికారులను తొలగించాలన్నారు. పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్న ఇండస్ యూనివర్సల్ , పల్లవి స్కూల్ లా యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

బేసిక్ కోర్సులతో ఆకర్షణ..

నీట్, ఎంసెట్, జేఈఈ లాంటి పరీక్షలకు బేసిక్ కోర్సులు అందిస్తామంటూ అడ్మిషన్లు ఆకర్షిస్తున్నారు. రకరకాల పేర్లతో పిల్లల భవిష్యత్తును ఆశ చూపిస్తూ.. తల్లిదండ్రుల బలహీనతలతో సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బుక్స్ తో పాటు ఫీజులను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed