- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆశగా చూస్తున్నాం సారూ.. ఎప్పుడు ఇస్తారు..?

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 11: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బిపిఎల్ కుటుంబాలు రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు)ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడూ..అప్పుడూ అంటూ నెట్టుకొస్తుందే తప్ప ఎప్పుడిస్తుందో కచ్చింతంగా చెప్పడం లేదు. ఈలోపు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే బియ్యం నిల్వలు ఖాళీ అయిపోయాయి. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబం సన్నబియ్యాన్ని తీసుకెళుతుండటంతో.. కార్డులు లేని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి రేషన్ కార్డులు ఇవ్వకుండా దాటవేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తాము అధికారంలోకి రాగానే బిపిఎల్ కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశాయి. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు 16 నెలలవుతోంది. ఇప్పటికీ రేషన్ కార్డుల అంశం ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప కార్డులు జారీకి నోచుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల దాకా లాగేస్తారేమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సర్వే తరువాత అర్హుల జాబితా తయారీ..
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సర్వే అధికారులు సర్వే అనంతరం డిఎస్ఓ లాగిన్ లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి రేషన్ కార్డు అర్హుల జాబితాతో పాటు సర్వే రిపోర్టు కూడా డిఎస్ఓ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. అన్ని మండలాల నుండి వచ్చిన అర్హుల వివరాలను జిల్లా కార్యాలయం నుండి పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. అన్ని వివరాలు ప్రభుత్వానికి చేరుకున్నాక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రేషన్ కార్డులు జారీ ప్రక్రియ జిల్లాలో మొదలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైతే సర్వే పూర్తవ్వాల్సిఉందంటున్నారు.
ప్రతినెలా 8,248 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 759 రేషన్ షాపుల ద్వారా 8248.076 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. జిల్లాలో రేషన్ కార్డులు 4,03,154 ఉండగా, ఆహార భద్రత కార్డులు (ఎఫ్ ఎస్ సీ) 3,80,222, ఏఎఫ్ ఎస్ సి కార్డులు 20,916 కార్డులు, ఏఏపీ కార్డులు 1,016 కార్డులున్నాయి. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో సభ్యులు13,10,012 మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తికి ప్రతినెలా ఆరుకిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుండి దరఖాస్తులను కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. రేషన్ కార్డులు లేక ఉచిత బియ్యం,ఆసరా పెన్షన్‌లు, ఇతర సంక్షేమ పథాకాలకు నోచుకోని వారెందరో ప్రజాపాలనలో ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. మీసేవా సెంటర్ల ద్వారా కూడా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలనలో దాదాపు 70 వేల వరకు, మీసేవ ద్వారా దాదాపు 90 వేల పైచిలుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. దరఖాస్తులన్నింటిని అధికారులు పరిశీలిస్తున్నట్లు, అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పైలట్ గ్రామాల్లో వందశాతం పథకాల అమలు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఈ ఏడాది జనవరిలో ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా దాదాపు వేయికి పైగా అర్హత కలిగిన వారందరికీ కార్డులు జారీచేశారు.
పక్కాగా నిబంధనలు పాటిస్తే చాలా మందికి రేషన్ కార్డులు హుళక్కే..
కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం పొందుపరిచిన నిబంధనలు, అర్హత ప్రమాణాలు చాలా మంది రేషన్ కార్డుల దరఖాస్తు దారులను అనర్హులుగా తేల్చేవిధంగా ఉన్నాయని, అర్హుల గుర్తింపులో గైడ్ లైన్స్ కచ్చితంగా ఎక్కువ మందికి కార్డులు అందని ద్రాక్షగా మిగిలే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ విషయంలో కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
సర్వే ఎప్పటికి పూర్తవుతుందో..?
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై సర్వే చేస్తున్నారని అధికారులు చెపుతున్నారు. త్వరలోనే సర్వే పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వేవిషయంలో స్పష్టత రావాల్సి ఉంది. సర్వే మున్సిపల్ అధికారులు చేయాలో, రెవెన్యూ అధికారులు చేయాలో స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సర్వే కొనసాగుతోంది. శిక్షణ పొందిన సర్వే అధికారులు సర్వే వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక సర్వే రిపోర్టును ప్రభుత్వానికి పంపనున్నారు.