రైతులను న‌మ్మించి మోసం చేస్తున్న మిర్చి వ్యాపారులు

by Mahesh |
రైతులను న‌మ్మించి మోసం చేస్తున్న మిర్చి వ్యాపారులు
X

దిశ‌, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏజెన్సీ మండ‌లంలో మిర్చి రైతులు మిర్చి ట్రేడ‌ర్స్ కంపెనీల చ‌ర్యల‌తో ద‌గాకు గుర‌వుతున్నారు.పెట్టుబ‌డిగా బ్యాంక్ ద్వారా న‌గ‌దు పంపించి రైతులకు పంట చేతికి వచ్చాక రైతుల ద‌గ్గర నుంచి మిర్చి ఏత్తుకుని వ్యవ‌సాయ మార్కెట్ క‌మిటీ నుంచి ప‌ట్టీలు ఇవ్వకుండా మిర్చి రైతుల‌ను మోసం చేస్తున్నారు. ఏత్తుకున్న పంటకు లెక్క చెప్పకుండా ఇంకా బ‌కాయిలు ఉన్నాయంటూ రైతుల‌ను వేధింపుల‌కు గురి చేస్తూ బెదిరింపుల‌కు పాల్పడుతున్నారు. ఈ ఘ‌ట‌న ఏటూరునాగారం మండ‌లంలోని రామ‌న్నగూడెంలో చోటుచేసుకుంది. విశ్వస‌నీయంగా తెలిసిన స‌మాచారం మేర‌కు వివ‌రాలు ఇలా..

న‌మ్మించి మోసం చేస్తున్న మిర్చి ట్రేడ‌ర్స్‌..

2018, 2019, 2020 సంవత్సరంలో ఏటూరునాగారం మండ‌లంలోని రామ‌న్నగూడెం గ్రామంలో కొంతమంది మిర్చి రైతుల‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మిర్చి ట్రేడ‌ర్స్ కంపెనీ మిర్చి పంట సాగు కోసం పెట్టుబ‌డిగా బ్యాంక్ ద్వారా మిర్చి రైతులకు అకౌంట్‌లోకి న‌గ‌దు జమ చేసింది. అయితే పంట చేతికొచ్చే స‌మ‌యంలో క‌రోనా ద‌శ మొద‌లైంది. కాగా, ఇదే సమ‌యంలో పంట చేతికి రావ‌డంతో పెట్టుబడి పెట్టిన మిర్చి ట్రేడింగ్ కంపెనీ రైతుల నుంచి ఏండు మిర్చిని క‌ళ్లంలోనే రైతు వ‌ద్ద నుంచి ఎటువంటి ర‌శీదులు ఇవ్వకుండా న‌మ్మకంపై తీసుకెళ్లింది. కాగా, క‌రోనా స‌మ‌యం కావ‌డం గిట్టుబాటు ధ‌ర లేదంటూ ఎండి మిర్చి పంటను ఏసీలో నిలువ ఉంచాం అంటూ కొంత కాలం మిర్చి ట్రేడ‌ర్స్ కంపెనీ వాళ్లు కాలాయాప‌న చేస్తూ రైతులకు మాయ మాట‌లు చెప్తూ కాలం వెళ్లదీశారు.

కొంతకాలం త‌ర్వాత రైతుల‌కు తెలియ‌ ప‌ర‌చుకుండానే మిర్చి ట్రేడ‌ర్స్ కంపెనీ య‌జ‌మాన్యం ఏండు మిర్చి కాయల‌ను విక్రయించారు. ఏండు మిర్చిని విక్రయించిన స‌మ‌యంలో రైతుకు ధ‌ర కానీ, ఏన్ని క్వింటాలు అమ్ముతున్నామ‌నే స‌మాచారం కూడా కంపెనీ వారు తెలియ‌జేయలేదు. పెట్టుబ‌డి పెట్టిన కంపెనీ కావ‌డంతో రైతులు త‌మ పంటను అందించామని, అప్పు తీరి ఉంటుంద‌ని అనుకున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో కంపెనీ య‌జ‌మాని మృతి చెందాడు. దీన్ని అదునుగా చేసుకున్న కంపెనీలోని కొంతమంది వ్యక్తులు త‌మ‌కు ఎటువంటి ఏండు మిర్చి స‌రుకు ఇవ్వలేదని, పెట్టుబ‌డిగా తీసుకున్న న‌గ‌దు ఇవ్వాల‌ని వేధింపులు, బెదిరింపులు మొద‌లు పెట్టారు. రైతులు మాత్రం తాము స‌రుకు అంద‌జేశామ‌ని, వాటి లెక్కలు తేల్చాల‌ని వారిస్తున్నా మాకు సంబంధం లేదన్నట్టుగా కంపెనీ నుంచి వ‌చ్చిన వ్యక్తులు న‌గ‌దు కోసం ప‌లు ర‌కాలు బెదిరింపుల‌కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది.

రైతులకు విక్రయ‌ ప‌ట్టీలు ఇవ్వని వైనం..

రైతుల నుంచి మిర్చి పంట‌ను తీసుకున్న కంపెనీ విక్రయాల స‌మ‌యంలో కానీ, విక్రయ అనంత‌రం కానీ రైతుల‌కు వ్యవ‌సాయ మార్కెట్ క‌మిటీ నుంచి విక్రయ ప‌ట్టీలు ఇవ్వాలి. ఎంత రేటుకు అమ్మారు? ఎన్ని క్వింటాలు అమ్మారు? కొన‌గోలు చేసింది ఎవ‌రు? విక్రయించింది ఎవ‌రు? అనేది ఆ ప‌ట్టీల్లో పొందు ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. కానీ అటువంటి విక్రయ పట్టీలు ఏవి ఇవ్వ లేదని, ప‌లుమార్లు అడిగినా ఇవ్వడం లేద‌ని దిశ‌కు రైతులు విశ్వస‌నీయంగా తెలిపారు. ఇదిలా ఉండ‌గా మార్కెట్‌లో సైతం కంపెనీ వారు విక్రయ ప‌ట్టీలు ఇవ్వకుండా తెల్ల కాగితంపై లెక్కలు రాసి జీరో దందా కొన‌సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బ‌కాయిలు చెల్లించాల‌ని వేధింపులు..

రైతుల‌కు తెలియ‌కుండానే ఏండు మిర్చి విక్రయాలు జ‌రిపిన కంపెనీ వారు ఎటువంటి లెక్కలు చెప్పకుండా పెట్టుబ‌డిగా పెట్టిన న‌గ‌దు చెల్లించాలని గ‌త 2ఏళ్లుగా వేధింపులు గురి చేస్తున్నార‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. తాము ఇచ్చిన స‌రుకుకు లెక్కలు అడిగితే బెదిరింపుల‌కు పాల్పడుతున్నార‌ని రైతులు వాపోతున్నారు. ఈ విష‌యంపై సంబంధిత అధికారులు దృష్టి సారిస్తే పూర్తి నిజాలు వెలుగు చూస్తాయ‌ని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా గుంటూరుకు చెందిన మిర్చి ట్రేడ‌ర్స్ కంపెనీ భారీన ప‌డి చాలా మంది రైతులు నష్టపోయారని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఎం చేయాలో తెలియ‌క కంపెనీ వేధిపులు ప‌డ‌లేక చావే శ‌రణ్యం అన్న ప‌రిస్థితి నెల‌కొన్నదని రైతులు వాపోతున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed