అదనపు కలెక్టర్ వద్ద ధరణి దరఖాస్తులు పెండింగ్!

by Mahesh |
అదనపు కలెక్టర్ వద్ద ధరణి దరఖాస్తులు పెండింగ్!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి కష్టాలు తొలగిపోతాయని అర్హులైన రైతులు ఆశపడ్డారు. గత ప్రభుత్వంలో రియల్​ వ్యాపారులకు, ప్రభావితం చేసే రాజకీయ నాయకులకే న్యాయం జరిగిందనే చర్చ ఉంది. పేదలకు, మధ్య తరగతి రైతుల భూ వివాదాలు అలాగే ఉండిపోయాయి. అంతేకాకుం డా ఆపదకు, అవసరాలకు వడ్డీకి పావుసేరు లాగా రూ.కోట్లు విలువ చేసే భూములను లక్షలకు విక్రయించారు. దీంతో అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉండే కొంతమంది నేతలు పేదల భూములను కొనుగోలు చేసుకొని ధరణి కష్టాలను క్లియర్​చేసుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుతం కాంగ్రెస్​పార్టీ ఎన్నికల్లో ధరణిని తొలగించి అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేసే భూ భారతిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా భూ భారతిని అందుబాటులోకి తీసుకరాలేకపోయారు. కానీ ప్రస్తుతమున్న ధరణి వెబ్​సైట్‌ను ప్రక్షాళన చేసి అధికారులకు పని విభజన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాస్ బుక్ ఉన్నవాళ్లకు ఎలాంటి భూ సమస్యనైనా తక్షణమే పరిష్కారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో వెబ్​సైట్​ అప్​లోడ్లో చేసిన తప్పులను సరిదిద్దేందుకు పరిష్కారం దొరకకపోవడం గమనార్హం. అలాంటి భూ సమస్యల పరిష్కారం కావాలంటే కలెక్టర్, అదనపు కలెక్టర్​లాగిన్​లతోనే ముడిపడి ఉంది. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్​లాగిన్‌లోనే దరఖాస్తులకు బ్రెక్​ పడినట్లు తెలుస్తున్నది.

రెవెన్యూకు అదనపు కలెక్టర్​వచ్చేదెప్పుడు..?

రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలకు పరిష్కారం లేనట్టేనా..? విలువైన భూములు ఈ జిల్లాలో ఉండడంతో రోజు కో సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్, భూధాన్, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్​బోర్డు భూములు అత్యధికంగా ఉన్నాయి. ఈ భూములను గుట్టుచప్పుడు కాకుండా కాజేసుకునేందుకు కుట్ర జరుగుతున్న ది. ఈ భూములను క్లియర్ చేయడంలో అధికారులు ఆలోచించడంలో తప్పులేదు. కానీ పట్టా భూముల్లో ఉన్న సమస్యలను క్లియర్​ చేసేందుకు అధికారులు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు. అర్హులైన పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతి సమస్యకు కలెక్టరేట్ కార్యాలయానికే బాధితులు క్యూకట్టిన దాఖలాలున్నాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలోని తహశీల్దార్, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు వాళ్ళ స్థాయిలోని దరఖాస్తులను క్లియర్​చేస్తున్నారు. అదనపు కలెక్టర్​ స్థాయిలోనున్న దరఖాస్తు లు క్లియర్​ అయ్యేందుకు యేండ్లు ప డుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రిపోర్ట్​ క్లియర్‌గా ఉన్నప్పటికీ ఫైళ్లకు సమాచారం కోసం వచ్చిన వ్యక్తికి సంబంధం లేకుంటే రిజెక్ట్​ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి.

గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు అనుమానం వచ్చిన ఫైళ్లను క్లియర్​ చేయకుండా అదనపు కలెక్టర్​ పెండింగ్‌లో పెడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో పైరవీకారులకు చెక్​పెట్టినట్లు అవుతున్నది. కానీ వాస్తవంగా అర్హుడు అదనపు కలెక్టర్​వద్దకు వచ్చి అనారోగ్యంతో వివరణ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు అధికారి నిర్ణయంతో అన్యాయమైపోతున్నాడు. అధికారుల పై నమ్మకంతో ఉన్న రైతులకు ఫైళ్లు క్లియర్​ కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం లోకల్​ బాడీ, రెవెన్యూ విభాగాలకు ఒకే అదనపు కలెక్టర్ ​ఉండడంతో పనిభారం ఉందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. కానీ రెవెన్యూకు సంబంధించిన 15వేలకు పైగా ధరణి దరఖాస్తులు అదనపు కలెక్టర్​ లాగిన్‌లో పెండింగ్​ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇన్ని దరఖాస్తులు ఉండడంతో ఫైళ్లు క్లియర్​ కాక అవస్థలు పడుతున్న బాధితులకు సమాధానం ఏమిటనే ప్రశ్న వస్తుంది. మరో అదనపు కలెక్టర్​ వచ్చే వరకు దరఖాస్తులు క్లియర్​ కావనే ప్రచారం జోరుగా సాగుతోంది.

క్షేత్రస్థాయి రిపోర్ట్‌​తో క్లియర్​..

గత ప్రభుత్వంలో పనిచేసిన విధంగా అధికారులు పనిచేయడం లేదని తెలుస్తోంది. పైరవీకారులకు అనుకూలంగా నివేదికలు రాసే పరిస్థితి లేదని తెలుస్తోంది. హైడ్రా తో పాటు కలెక్టర్​ పర్యవేక్షణతో స్థానిక తహశీల్దార్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జా, రియల్​ వ్యాపారుల ఆగడాలనే వార్తలు వస్తే తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. దీంతో అక్రమార్కులు, కబ్జాదారుల గుండెల్లో అలజడి మొదలైంది. కానీ ధరణి దరఖాస్తుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు నిబంధనలకు అనుకూలంగా ఉన్నప్పటికీ క్లియర్​ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

పెండింగ్‌లో టీఎం అప్లికేషన్లు..

టీఎం 33 అప్లికేషన్లు పెద్ద ఎత్తున పెండింగ్‌​లో ఉన్నాయి. జిల్లాలోని యాచారం, అబ్ధుల్లాపూర్​మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, కేశంపేట్​, కొందుర్గ్​, నందిగామ, చేవెళ్ల, షాబాద్​ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రజలున్నారు. వీరి భూములు ధరణి లో అప్​లోడ్​ చేయడంలో అప్పట్లో అధికారులు విఫలమైనట్లు తెలుస్తున్నది. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రజలు బలైన పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్​ లాగిన్​ వరకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలోని సిబ్బంది పంపిన నివేదిక ఆధారంగానే ఎప్పటికప్పుడు క్లియర్​ చేస్తున్నారు. కానీ అదనపు కలెక్టర్​ లాగిన్‌​లోనే పెండింగ్​ ఉండడంతో కలెక్టర్​ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story