ట్రాఫిక్ కష్టాలు- ఇబ్బందుల్లో వాహనదారులు

by Kalyani |
ట్రాఫిక్ కష్టాలు- ఇబ్బందుల్లో వాహనదారులు
X

దిశ, శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ వద్ద గల ఫ్లైఓవర్ వంతెన సైడ్ వాల్ నిర్మాణం పనులు జరుగుతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. శంకర్పల్లి నుంచి చేవెళ్ల వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్ వంతెన వద్దకు రాగానే ఒకవైపు నుంచి వాహనాలను మాత్రమే అనుమతిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. శంకర్పల్లి నుంచి చందిప్ప రామంతపూర్ ఎలవర్తి, కొజ్జా గూడ, పర్వేద, సంకేపల్లి, అంతప్ప గూడ, మాసాని కూడా కొత్తపల్లి తో పాటు చేవెళ్ల షాబాద్,షాద్నగర్ వెళ్లే వాహనాలు, షాబాద్ చేవెళ్ల షాద్నగర్ నుంచి సంగారెడ్డి శంకర్పల్లి వైపు వచ్చే వాహనాలు ఎదురెదురుగా వస్తు వంతెన పై నిలిచిపోతున్నాయి.

వంతెనపైన డివైడర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా రావడం నియంత్రించడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. పనులు పూర్తయ్యే వరకు ఆర్ అండ్ బి అధికారులు పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాల ద్వారా వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదు. వర్షాలు కూడా పడుతుండడం గుంతలలో వర్షపు నీరు నిలబడడం ద్విచక్ర వాహనదారులకు నరకం కనిపిస్తుంది. చందిప్ప గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ రాగా ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయా పార్టీల నాయకులు, విలేకరులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది.

శాసనసభ స్పీకర్ చేవెళ్ల ఎమ్మెల్యే తదితరులు మరో మార్గం ద్వారా కార్యక్రమానికి హాజరయ్యారు. వీరు కూడా ఇదే దారిన వస్తే ప్రజల సమస్యలు తెలిసేవని పలువురు వాహనదారులు శాపనార్థాలు పెడుతున్నారు. చేవెళ్ల నుంచి పార్లమెంట్ స్థానానికి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఒకసారి శంకర్ పల్లి కి వచ్చి ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుంటే బాగుంటుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed