దేవుడు పేరుతో ఓట్లు కొల్లగొడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
దేవుడు పేరుతో ఓట్లు కొల్లగొడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, మహేశ్వరం, శంషాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి పేరుతో ఓట్లు కొల్లగొడుతున్నారని. బీజేపీ నాయకులు రేషన్ బియ్యంలో పసుపు కలిపి అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలని ప్రజలను నమ్మించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్​ షా దేశాన్ని అదాని,అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారన్నారు.

మేము కూడా హిందువులమని భద్రాచలం శ్రీరాముని, గ్రామాలల్లో మైసమ్మ ,ఎల్లమ్మ దేవతలను మొక్కుతామన్నారు. బీజేపీ నాయకులు మాకు సంస్కృతి నేర్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలలో బీజేపీ నాయకులు పంచిన అక్షింతలు నిజంగా అయోధ్య నుంచి తెచ్చినవే అయితే భద్రాచలం రాముడుపై ఒట్టు వేసి చెప్పే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేవుడుని గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలన్నారు. అదే నిజమైన హిందువు లక్షణమన్నారు. తప్పులను ప్రశిస్తే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ నాయకులను బంధిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు.

రాష్ట్రంలో గజ్వేల్ గజీని ని గద్దె దింపామన్నారు. దేశంలో గుజరాతీల పెత్తనము గద్దె దింపుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చామన్నారు. బీజేపీ అయోధ్యని సెంటిమెంట్ గా వాడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి పేరు సెంటిమెంట్ గా వాడుతుందన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేసేలా బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత, గిరిజన బాధలు బిజేపికి పట్టలేదన్నారు. నిరుద్యోగ యువతను ఇస్తానన్న 20 కోట్ల ఉద్యోగాలను ఇవ్వలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ అవహేళన చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కేటీఆర్ కు కనబడకపోతే చీర కట్టుకొని చింతమడక నుంచి సిరిసిల్ల వరకు బస్సు ఎక్కితే ఆరు గ్యారంటీలను అమలు అవుతున్నాయో లేదో అని కేటీఆర్ కు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలోనే భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రంజిత్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సబితా ఇంద్రారెడ్డి బీజేపీ పార్టీకి ఓటు వేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, నేరెళ్ల శారద, కేఎల్ఆర్, దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed