ఆశల పల్లకిలో ఆశావాహులు..!

by Sumithra |
ఆశల పల్లకిలో ఆశావాహులు..!
X

దిశ, తాండూరు రూరల్ : ఎవరైనా ఆశపడడం తప్పుకాదు. అది ప్రకృతి సహజం. అత్యాసకు పోతేనేవిరుద్ధమవుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇదే వర్తిస్తుంది. అలాంటి ఆశలతోనే ఈ ప్రాంత నేతలు కళలలోకంలో విహరిస్తున్నారు. 2024ఎన్నికల్లో అన్నిపార్టీల నేతలు ఈసారి టికెట్ తమకే అని పెద్ద సీన్ క్రియేట్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు సీనియర్‌ నేతల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఆ ఇద్దరు నేతలూ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు సీనియర్‌ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా గ్రూపులు నడుపుతున్నందుకు ఎమ్మెల్యే టికెట్ ఎవరిని వరిస్తుందో సందిగ్ధంగా మారింది. అన్ని పార్టీల్లోనూ ఉన్న గ్రూపుల తగదాల వల్ల ఎమ్మెల్యే టికెట్ కోసం హోరా హోరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అధికార పార్టీలో నువ్వానేనా..!

తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్‌ రోహిత్‌రెడ్డి పోటీపడుతున్నారు. రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూవచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్‌ పదవుల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్‌ సీఎం కేసీఆర్‌ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పై చేయిగా నిలిచారు. ఎమ్మెల్యే టికెట్ తమకే వస్తుందని ఇక్కడ ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా గ్రూపు నడుపుతున్నారు.

కాంగ్రెస్‌లో డబుల్‌ గేమ్‌..

కాంగ్రెస్ పార్టీలో డబుల్ గేమ్ తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో రమేష్ మహారాజ్ ఉన్నారు. రమేష్ తోపాటు ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు కొందరు డబుల్ గేమ్ ప్రచారం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి పై గెలుపొందాడు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి క్యాడర్ ఉంది.

బీజేపీలోనూ కొత్త ఆశలే..!

గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బలపడడంతోనే ఆ ముగ్గురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో తాండూరు బీజేపీ నేతల్లో కూడా ఆశలు పుడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో తాండూరు నుండి గట్టి పోటీకి కమలం నేతలు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్, నరేష్ మహారాజ్, మాజీ జిల్లా లైబ్రరీ చైర్మన్ మురళి గౌడ్ లు ఆశిస్తున్నట్లు సమాచారం.

కలిసొచ్చేది ఎవరికో..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అన్ని పార్టీనేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీల నుండి ఎవరికి వస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారికి రాజకీయ భవిషత్ ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ పార్టీల నుండి కలిసొచ్చేది ఎవరికో అన్నది తెలవాలంటే వేచి చూడాలి మరీ.

Advertisement

Next Story

Most Viewed