తాత్కాలికంగా బ్రేక్!

by Disha Web Desk 11 |
తాత్కాలికంగా బ్రేక్!
X

దిశ, రాజేంద్రనగర్ : తాను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల అభీష్టం మేరకు ఆ పార్టీలోనే కొనసాగుతానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి.. ప్రకాష్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారని విస్తృతంగా చర్చ జరిగింది.

దీంతో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చాలామంది నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం సరికాదని, బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కష్టపడి విజయం సాధించామని చెప్పారు. బీఆర్ఎస్ లో మంచి గుర్తింపు, గౌరవం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని, ఆ పార్టీలో ఇమడలేమని స్పష్టం చేశారు.

- అభివృద్ధి కోసం వెళ్దాం..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నియోజకవర్గ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రజా ప్రతినిధులు, నేతలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రస్తుతానికి పార్టీ మారేది లేదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. తనకు బీఆర్ఎస్ పార్టీ మంచి గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని చెప్పారు.



Next Story