- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజశ్యామల అనుగ్రహంతోనే తెలంగాణ ప్రగతి: స్వరూపానందేంద్ర
దిశ, గండిపేట్: రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంట్ కోతలు, నీటి కొరత తెలంగాణను వెంటాడతాయని అంతా భావించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించారని తెలిపారు. హైదరాబాదు కోకాపేటలోని మూవీ టవర్ వద్ద విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శంకుస్థాపన చేశారు.
ఈ ఆలయం నిర్మాణానికి 8 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. శంకుస్థాపన సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే కేసీఆర్ తమ పీఠానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే కేసీఆర్ ఆకాంక్షించారని అన్నారు.
రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబాలను అడిగితే చెబుతారని అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆర్ధిక వనరులు లేకపోయినా రాజశ్యామల ఉపాసనాబలంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. కలియుగంలో శక్తివంతమైన అమ్మవారు రాజశ్యామలేనని వివరించారు. రాజశ్యామల ఆరాధనతో మాజీ ప్రధాని పీవీతో సహా ఎంతోమంది గొప్పవారయ్యారని గుర్తు చేశారు. రాజశ్యామల పేరిట కొంతమంది ఆశాజీవులు హోమాలు, యాగాలు చేపడుతున్నారని, కానీ, ఉపాసనా బలం, శక్తివంతమైన తంత్రశాస్త్రం తెలియకుండా అవి ఫలించవని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాజశ్యామల ఆలయ నిర్మాణానికి కొందరు ప్రముఖులు ముందుకొచ్చారని, కానీ భక్తులందరి భాగస్వామ్యంతోనే ఆలయ నిర్మాణం పూర్తి కావాలని భావించానని పేర్కొన్నారు. అమ్మవారు ఏ ఒక్కరి సొత్తూ కాదని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పవిత్ర గంగా జలాలు, అలకానంద, భగీరథ నదుల నుంచి రప్పించిన పుణ్య జలాలను శంకుస్థాపన సమయంలో వినియోగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.