తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Kalyani |   ( Updated:2023-08-23 11:45:09.0  )
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ శంషాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని వికలాంగులకు పెన్షన్ 3016 నుండి 4016 కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డర్ ను బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని, వైఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వితంతువులకు, వికలాంగులకు కేవలం నెలకు 200 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 1000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు.

అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 1000 రూపాయలు ఉన్న పెన్షన్లు 2 వేలకు పెంచి వికలాంగులకు 3016 వరకు పెంచారన్నారు. మరోసారి ఎవరు అడగకపోయినా వికలాంగులకు 3016 ఉన్న పెన్షన్ 4016 రూపాయలకు పెంచుతూ జీవో విడుదల చేయడం చాలా సంతోషం అన్నారు. పెంచిన పెన్షన్ వచ్చే నెల నుండి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఏది అవసరం ఉందో అది ఎవరు అడగకపోయినా అమలు చేసి లబ్ధిదారులకు అందజేయడంలో గొప్ప నాయకుడు అన్నారు. ఇతర పార్టీ నాయకులు కల్లిబొల్లి మాటలు చెబుతూ కాలం గడుపుకుంటారే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ల ఎవరు మాట నిలబెట్టుకోరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో లాగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story