కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Kalyani |
కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, షాద్ నగర్: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సహకార కోఆపరేటివ్ చైర్మన్ రాజా వరప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామే అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, 60 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.

వాళ్లలో వాళ్ల కుమ్ములాటలకే వాళ్లకు సమయం సరిపోవడం లేదని, ఇంకా ప్రజలను ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం తాపత్రయపడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకుంటే, దొంగల్లా రాష్ట్రంలో రాజ్యమేలడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 8 ఏళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మత రాజకీయాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్పా.. ఏ రోజు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాంలు, కుంభకోణాలు చేసి దేశాన్ని నిలువునా దోచుకున్న పార్టీ ఒకటయితే, మరొకటి గుజరాతీల చేతుల్లో మొత్తం దేశాన్ని అమ్మకానికి పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే అధికారం కట్టబెడతారని, ఇంకో 15 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story