డ్రగ్స్‌, గంజాయికి అడ్డాగా మారుతున్న తట్టి అన్నారం

by Mahesh |
డ్రగ్స్‌, గంజాయికి అడ్డాగా మారుతున్న తట్టి అన్నారం
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : గంజాయి, ఇతర డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత పెడదోవ పడుతున్నది. సంబంధిత పోలీసులు కళాశాలలో డ్రగ్స్ నివారణపై కౌన్సిలింగ్ చేపడుతున్న యువతలో మార్పు రావడం లేదు. కళాశాలల పరిసరాల్లో ఉన్న స్థలాల్లో గంజాయి వాడుతున్నట్లుగా గుర్తించినా సంబంధిత కళాశాలతో పాటు యువతలో మార్పు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ తట్టి అన్నారం పరిధిలో గంజాయి, ఇతర డ్రగ్స్ విక్రయాలు జోరుందుకున్నట్లు తెలుస్తున్నది. నాగోల్, బండ్లగూడ పరిధిలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో యువత సాయంకాలం సమయంలో నిత్యం డ్రగ్స్ మత్తులో కొంతమంది యువకులు చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. రోడ్లపైనే పెద్దఎత్తున ఫైటింగ్‌లు చేసుకుంటున్నారు. ఇటీవల సదరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ విల్లా, అపార్ట్మెంట్ పరిసరాల్లో మద్యం, డ్రగ్స్ మత్తులో రోడ్లపై విచ్చలవిడిగా తన్నుకున్నారు.

ఒక్కరోజు, రెండు రోజులు ఇలా జరుగుతుందంటే కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ నిత్యం ఇదే తంతుగా ఈ ప్రాంతాల్లో జరుగుతుండడంతో కళాశాలలపైనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. పేరుకే ఇంజినీరింగ్ కళాశాల. ఫీజుల రూపంలో డబ్బులు వసూలు తప్ప విద్యార్థులు ఏ రకంగా పెడదోవ పడుతున్నారో అన్న అంశంపై సదరు కళాశాల యాజమాన్యం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. రోడ్లపై జరుగుతున్న ఫైటింగ్‌కు కారణం కళాశాల విద్యార్థులు కావడం, సదరు కళాశాలకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా కళాశాల బయట జరిగిన అంశాలతో తమకు ఏమీ సంబంధం లేదన్నట్లు సదురు కళాశాల యాజమాన్యం చేతులు దులుపుకుంటుందన్న ఆరోపణలున్నాయి. నాగోల్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ కళాశాల పరిసరాల్లో జరుగుతున్న గంజాయి, ఇతర డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో యువత పెడదోవ పడుతున్న కళాశాల యాజమాన్యం మాత్రం ఆ వైపు శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి.

కౌన్సెలింగ్ నిర్వహించినా..

విషయం తెలుసుకున్న సంబంధిత పోలీసు యంత్రాంగం పలుమార్లు కౌన్సిలింగ్ పేరుతో సదరు కళాశాలలో కార్యక్రమాలు కూడా నిర్వహించిన దాఖలాలున్నాయి. కానీ కళాశాల యాజమాన్యం మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించి డ్రగ్స్ వినియోగం పై విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

నిద్ర మత్తులో ఎక్సైజ్ శాఖ..

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు ఫలానా ప్రాంతాల్లో దొరుకుతుందన్న సమాచారం ఎక్సైజ్ అధికారులకు తెలిపినా తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మద్యం విక్రయాలు జరపడంలో టార్గెట్లు ఫినిష్ చేసేలా తమ డ్యూటీని చేస్తున్నారన్న విమర్శలున్నాయి. మంచినీళ్ల కంటే ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నా సంబంధిత అధికారులు అటువైపు శ్రద్ధ చూపుతున్న దాఖలాలు ఏమీ లేవు. విద్యార్థులు ఫలానా కళాశాలలో తమ పిల్లల్ని చేర్పిస్తే బాగుపడతారన్న నమ్మకంతో తల్లిదండ్రులు అడ్మిషన్లు చేయిస్తుంటే.. తల్లిదండ్రులకు చెప్తున్నా పద్ధతులేవీ విద్యార్థులకు చెప్పకపోవడంతో పాటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా మత్తు, గంజాయి వంటి అంశాలపై సదరు కళాశాల యాజమాన్యం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఆ కళాశాల యాజమాన్యం తో పాటు సంబంధిత అధికారులు సదరు పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేసి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న, గంజాయి తీసుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులు భావి పౌరులుగా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed