కోట్‌పల్లిలో బెల్ట్ దందా!

by S Gopi |
కోట్‌పల్లిలో బెల్ట్ దందా!
X

దిశ, ప్రతినిధి వికారాబాద్: జిల్లాలో జోరుగా బెల్ట్ షాపులు వెలిశాయి. ఫలితంగా కోట్‌పల్లి మండల కేంద్రంలో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం వరకు కోట్‌పల్లి మండల కేంద్రంలో మద్యం అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రస్తుతం జిల్లాలోనే టాప్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఫ్యామిలీ రెస్టారెంట్‌ల పేరిట ప్రధాన రహదారుల పక్కనే బార్ అండ్ రెస్టారెంట్‌ల స్థాయిలో బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. అయినా ఆబ్కారీ శాఖ అధికారులు అటుపక్కకు వెళ్లడం లేదు. దీంతో ఎలాంటి లిక్కర్ అనుమతులు లేకుండానే బార్ అండ్ రెస్టారెంట్‌ల మాదిరి కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ మందు అందిస్తున్నారు. ఫుడ్‌కు స్టార్ హోటల్ రేంజ్‌లో డబ్బులు వసూలు చేస్తు్న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రంలో ఇంత జోరుగా మద్యం దందా నడుస్తుంటే ఆబ్కారీ, పోలీసు, తూనికలు, కొలతలు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆ ఇండ్లల్లోనే అద్దెకు పోలీసులు!

మండల కేంద్రంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న రెండు బెల్ట్ షాపుల యజమానుల ఇంట్లోనే ఇద్దరు పోలీసులు అద్దెకు ఉండడం మరో ఎత్తని మండల కేంద్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే దగ్గరుండి వారిని ప్రోత్సహించడం ఏంటని ప్రతిపక్ష నాయకులతోపాటు జనం పేర్కొంటున్నారు. స్థానిక మండల నాయకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో మండలంలో, ముఖ్యంగా మండల కేంద్రంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా నడుస్తోందని తెలుస్తుంది. ఈ కారణంగా జిల్లాలోనే అత్యంత కమర్షియల్ జోన్‌గా పేరుగాంచిన కోటిపల్లి మండల కేంద్రంలో స్టార్ హోటల్ రేంజ్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని దాబాలు షాపుల్లో నకిలీ వాటర్ బాటిల్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం: తాండూర్ ఆబ్కారీ సీఐ

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బెల్ట్ షాపులు, ఫ్యామిలీ దాబాల పేరుతో ప్రధాన రహదారుల పక్కన చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఎవరూ నిబంధనలు ఉల్లంగించొద్దు.

Advertisement

Next Story

Most Viewed