- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranga Reddy District: బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట.. తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్
దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు అత్యధిక స్థాయిలో నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, రవాణా సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌తో భరోసా కల్పించింది. రంగారెడ్డిలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు మరమ్మతులు, రీజినల్ రింగ్ రోడ్డుకు అత్యధిక నిధులు కేటాయించడంతో బడ్జెట్‌లో జిల్లాకు పెద్దపీట వేసినట్లయ్యింది. రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రంగారెడ్డి జిల్లా, అతి తక్కువ ఆదాయం వికారాబాద్ జిల్లా అని బడ్జెట్‌లో ప్రభుత్వం ఉదారహణకు పొందుపర్చింది. ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగమైన వికారాబాద్ కూడా హైదరాబాద్ రాజధానికి అత్యంత సమీపంలో ఉంటుంది. కానీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల మధ్యనున్న తలసరి అంతరాయాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్ల కేటాయింపులోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తున్నది.
రీజినల్ రింగురోడ్డులో అధిక విస్తీర్ణం ఇక్కడే..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల భవిష్యత్ రీజినల్ రింగు రోడ్డుతో మారనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగు రోడ్డు కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. చౌటుప్పల్, షాద్ నగర్, సంగారెడ్డి ప్రాంతాలను కలుపుతూ ఏర్పడే రహదారికి రూ.1525 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో రీజినల్ రింగు రోడ్డు విస్తరించే ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు భారీ అవకాశాలున్నాయి. అంతేకాకుండా శాటిలైట్ సిటీ, ఐటీ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.
మౌలిక సదుపాయాలకే అధిక ప్రాధాన్యం..
రాష్ట్ర రాజధానిలో అంతర్భాగమైన రంగారెడ్డిలో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మెట్రో విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతమున్న నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరించడం, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మెట్రో విస్తీర్ణంతో రంగారెడ్డి జిల్లాలో రవాణా వ్యవస్థ అత్యంత మెరుగుపడి రాకపోకలు సులభతరమవుతున్నది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిచారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కోర్ అర్బన్ రీజియన్‌గా తీసుకొని ప్రభుత్వం హైడ్రా సంస్థ ద్వారా విపత్తుల నియంత్రణ చేపట్టనున్నది. ఇందుకు బడ్జెట్ రూ.200 కోట్లు కేటాయించింది.
సాగు నీటి ప్రాజెక్టు కలే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అత్యంత ఆధారమైన సాగునీటి ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల. ఈ ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లా ప్రజలను పదేండ్లుగా మభ్యపెడుతూ రాజకీయ పార్టీలు ఓట్లు దండుకుంటున్నాయి. కానీ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే పద్ధతి ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో రైతుల్లో ఆందోళన కలుగుతున్నది.
బడ్జెట్‌లో జిల్లాకే ప్రాధాన్యం: చల్లా నరసింహా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసే దిశగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమ శాఖలకు అత్యధిక నిధులు కేటాయించింది. నీటిపారుదల రంగానికి కేటాయించిన నిధుల్లోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా మెట్రో పెంపు, చెరువుల పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్లు ఏర్పాటు చేసింది
కార్మికులను ప్రభుత్వం విస్మరించింది: కాడిగాళ్ల భాస్కర్, సీపీఐఎం జిల్లా కార్యదర్శి
రాష్ట్ర ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక వర్గం సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ఆర్థిక వృద్ధిరేటులో కార్మిక వర్గం భాగస్వామ్యం అవుతుందన్న విషయాన్ని మరిచింది. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, బడ్జెట్ సమావేశంలో భూ పరిరక్షణ దిశగా ప్రస్తావనే లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కొత్త రేషన్ కార్డుల విషయంపై స్పష్టత లేదు. ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలి.
విద్యకు పెరిగిన కేటాయింపులు సరిపోవు: మాణిక్‌రెడ్డి, రిటైర్డ్ టీచర్
గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాదిలో బడ్జెట్ పెంచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో అంశాల అమలు సాధ్యం కాదు. విద్యారంగ సంస్కరణలు చేపట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం.. పునః సమీక్షించి విద్యకు కేటాయింపులు పెంచి దశాబ్దకాలపు విధ్వంసం నుంచి విద్యారంగాన్ని కాపాడాలి. పలు పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నూతన భవనాలు నిర్మించాలి. టాయిలెట్లు, తాగు నీటి వసతులు కల్పించాలి. ప్రతి పాఠశాలకు అటెండర్, వాచ్మెన్, పారిశుధ్య సిబ్బందిని నియమించాలీ. అల్పాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి నిధులు కేటాయించాలి. ఉచిత విద్యుత్ అమలు చేయాలి.
విద్యాభివృద్ధి సుసాధ్యం: సుధాకర్, ఎస్టీయూ నేత
విద్యాభివృద్దితోనే బంగారు తెలంగాణ సాధ్యం అని నినదిస్తున్న ప్రభుత్వం 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయిస్తున్నది. బడ్జెట్ గత సంవత్సరాలతో పోల్చుతూ వస్తే తగ్గుముఖం పడుతున్నది. గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా విద్యారంగానికి సరిపోయే నిధులు పెంచలేదు. పదేండ్లలో ప్రభుత్వ పాఠశాల విద్యకు సరిపోను నిధులు కేటాయించకపోవడంతోనే మౌలిక వసతుల కొరత తీవ్రమైంది. గాడితప్పిన విద్యను మళ్లీ తీర్చిదిద్దాలంటే బడ్జెట్‌లో కనీసం20శాతం నిధులు కేటాయిస్తే బాగుండేది. విద్యావేత్తలు, విద్యా పరిరక్షణ సమితి, మేధావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వం మాదిరిగా స్వల్ప కేటాయింపులు జరపడం బాధాకరం.
ఆశించిన విధంగా బడ్జెట్ లేదు: బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ప్రజలు ఆశించిన విధంగా లేదు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి రంగారెడ్డి జిల్లాకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతోనే ఎన్నికల్లో గెలిచారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకమైన నిధులు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతున్నది. అంకెల గారడీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందని తెలుస్తున్నది.