జిప్ లైన్‌పై ఉండి గుర్తించలేకపోయా..! ఉగ్రదాడి ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
జిప్ లైన్‌పై ఉండి గుర్తించలేకపోయా..! ఉగ్రదాడి ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి జిప్ లైన్ పై ప్రయాణిస్తున్న వీడియో సోమవారం బయటికి వచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో జిప్ లైన్ (Jip Line) పై ప్రయాణిస్తున్నది గుజరాత్ (Gujarath)లోని అహ్మదాబాద్ (Ahmedabad)కు చెందిన పర్యాటకుడు రిషిభట్ (Rishi Butt)గా గుర్తించారు. ఈ వీడియోపై రిషి భట్ స్పందించాడు. ఉగ్రదాడి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సంచలన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రిషి భట్.. నేను జిప్ లైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు.

ఆ సమయంలో గాలిలో ఉండటంతో దాదాపు 20 సెకన్ల వరకు కాల్పులు జరుగుతున్న విషయాన్ని గుర్తించలేకపోయానని చెప్పారు. కాల్పులు మొదలై వ్యక్తులు చనిపోతున్నారని హఠాత్తుగా గ్రహించానని, 5, 6 మందిని కాల్చివేయడం కళ్లారా చూశానని అన్నారు. సుమారు 20 సెకన్ల తర్వాత ఇది ఉగ్రదాడి అని తాను గ్రహించానని, జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని మూడు సార్లు చెప్పాడని, ఆ తర్వాతే కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. తమ కంటే ముందున్న రెండు కుటుంబాలలోని పురుషులను మతం గురించి అడిగి నా భార్య, కొడుకు ముందే కాల్చి చంపడంతో వారు భయంతో కేకలు వేశారని, ఇది గమణించిన తాను బెల్ట్ విప్పి కిందికి దూకి.. భార్య, కొడుకుతో పారిపోవడానికి ప్రయత్నించానని చెప్పారు.

ఇంతలో అక్కడ ఒక గొయ్యిలాంటి ప్రదేశం కనిపించిందని, అక్కడే అందరూ దాక్కోవడం చూసి తాము కూడా అక్కడే దాక్కున్నామని వివరించాడు. 8 నుంచి 10 నిమిషాలు దాక్కున్న తర్వాత కాల్పుల మోతలు కొద్దిగా తగ్గాయని, దీంతో మెయిన్ గేట్ వైపు పరుగులు తీశామని చెప్పారు. మేం పరుగు మొదలు పెట్టాక మరో 4, 5 మంది కాల్పుల్లో మరణించారని, తమ ముందే 15, 16 మంది పర్యాటకులను కాల్చి చంపారని తెలిపారు. ఇక గేటు వద్ద చేరుకున్న సమయంలో స్థానిక ప్రజలు అప్పటికే వెళ్లిపోయారని, తమని ఓ పోనీ గైడ్ అక్కడి నుంచి తీసుకెళ్లాడని అన్నారు. అనంతరం ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకోవడం గమనించామని, కొద్దిసేపటిలోనే ప్రాణాలతో ఉన్న పర్యాటకులందరినీ ఆర్మీ సిబ్బంది కవర్ చేశారని, ఆర్మీ సిబ్బంది వచ్చిన తర్వాతే తమకు ప్రాణాలపై భరోసా కలిగిందన్నారు.

ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన కంటే ముందు 9 మంది జిప్ లైన్ లో ప్రయాణించారని, కానీ జిప్ లైన్ ఆపరేటర్ ఏమి మాట్లాడలేదని, తాను ప్రయాణిస్తున్న సమయంలోనే మూడు సార్లు అల్లాహు అక్బర్ అని సంభోదించాడని, అనంతరం కాల్పులు జరగడం మొదలైందని చెప్పారు. ఆ వ్యక్తిపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అడవిలో దిగువ ప్రాంతాల్లో కూడా సైన్యం ప్రతీచోట ఉందని, కానీ పర్యాటక ప్రదేశంలో ఎవరు లేరని తెలిపారు. అలాగే మెయిన్ గేట్ వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నారని రిషి భట్ వెల్లడించారు.



Next Story

Most Viewed