ఏండ్లుగా ఇక్కడే తిష్ట.. క్షేత్రస్ధాయిలోని అంగన్​వాడీలకు తప్పని తిప్పలు

by Anjali |
ఏండ్లుగా ఇక్కడే తిష్ట.. క్షేత్రస్ధాయిలోని అంగన్​వాడీలకు తప్పని తిప్పలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్లకేండ్లుగా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వర్తిస్తున్న అధికారులు మళ్లీ ఫైరవీలకు పదును పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగేండ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి బదిలీ కావాల్సిందే. ఆ బదిలీలు కూడా క్యాడర్‌ను బట్టి జరుగుతుంది. స్టేట్​ క్యాడర్​, మల్టీ జోన్​, జోన్​ల వారీగా బదిలీల ప్రక్రియ ఉంటుంది. అందులో భాగంగానే బదిలీల ప్రక్రియను వివిధ శాఖల అధికారులు సినీయారీటిని బట్టి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. కానీ రాజకీయ ప్రభావం కలిగిన ఉద్యోగులు బదిలీ ప్రక్రియలో తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలోని సీడీపీవోలు పైరవీలకు పావులు కదుపుతున్నారు.

పదేండ్లయినా పోస్టింగ్​..

రంగారెడ్డి జిల్లాలో 7 ప్రాజెక్టులున్నాయి. చేవెళ్ల, శేరిలింగంపల్లి, హయత్ నగర్​, ఇబ్రహీంపట్నం, షాద్ ​నగర్​, అమనగల్లు, మహేశ్వరం ఉన్నాయి. ఇందులో శేరిలింగంపల్లి, అమనగల్లు ప్రాజెక్టులోని సీడీపీవోలు డిప్యూటేషన్​‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 5గురిలో నలుగురు ఇక్కడే 10 ఏండ్లకు పైన ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు బదిలీలు లేకపోవడంతో ఒకే చోట పనిచేయడంలో తప్పు లేదు. కానీ బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి స్థాన చలనం చేసేందుకు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా బదిలీలకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు స్థానిక అంగన్​వాడీ టీచర్లను వివిధ కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మినీ అంగన్​వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆ టీచర్లకు అర్డర్​ కాపీలను తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని కొంత మంది సీడీపీవోలు అంగన్​వాడీ టీచర్లకు ఆర్డర్​ కాపీలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఒకే చోట ఏండ్లకేండ్లుగా అధికారులు తిష్ట వేసి అంగన్​వాడీ టీచర్లను వేధింపులకు గురిచేయడం దారుణం. అయినప్పటికీ ఇదే జిల్లాలో మరో ప్రాజెక్ట్​ అధికారిగా పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులతో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

బదిలీల్లో ప్రజాప్రతినిధుల జోక్యం ఎందుకు..?

ఉద్యోగిగా ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. అంతేకాకుండా ఇదే జిల్లాలో ఇదే ప్రాంతంలో పనిచేస్తాననే ఉద్దేశ్యం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎక్కడైన పనిచేసే హక్కు ఉద్యోగికి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొంత మంది ఉద్యోగులు ఏండ్లకేండ్లుగా ఒకే చోట పనిచేయడం, బదిలీ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాంతం వదిలివేళ్లేందుకు ఇబ్బంది పడడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇలాంటి ఉద్యోగులకు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉండడం గమనార్హం. ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల జోక్యం కలిగినప్పుడు కచ్చితంగా అనుమానాలు రాక తప్పదు. ఇలాంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లాలోని సీడీపీవోల బదిలీల్లో కొంత మంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed