బడంగ్ పేట్​లో పెట్రేగిపోతున్న అక్రమ సెల్లార్లు..

by Kalyani |   ( Updated:2023-05-15 12:18:09.0  )
బడంగ్ పేట్​లో పెట్రేగిపోతున్న అక్రమ సెల్లార్లు..
X

దిశ, బడంగ్​పేట్​: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. బడంగ్​పేట్ నగర పాలక సంస్థ కార్యాలయానికి కూత వేటు దూరంలో బడంగ్​ పేట్​ గ్రంథాలయ శాఖ కార్యాలయం నుంచి నాదర్​ గూల్​కు వెళ్లే ప్రధాన రహదారిలో వందల కొంది సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధి అండతోనే యధేచ్చగా నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు యాదేచ్చగా జరుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై నోటీసులు జారీ చేయడమే కాకుండా క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు జారీ చేసిన హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తున్నారు. అధికారుల నిఘాలోపం, అవినీతి, పర్యవేక్షణ లేమి కారణంగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి. కింది స్థాయి సిబ్బందే ముడుపులు తీసుకొని అక్రమంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో రెండు అంతకుమించి అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్న సమయంలో సెల్లార్​ నిర్మాణం కోసం మున్సిపల్​ అనుమతులు విధిగా తీసుకోవాలి. సెల్లార్​ నిర్మాణం చేపట్టాలంటే గృహనిర్మాణాలయితే 900 గజాల స్థలం, కమర్షియల్​గా ఐతే 500 గజాల స్థలం తప్పనిసరిగా ఉండాలి.

అది కూడా స్థలం యొక్క మట్టిని పరిశీలించి రిపోర్ట్స్​, అగ్నిమాపక అనుమతులు, భవన నిర్మాణం అయిన తర్వాత ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఆ భవనం చుట్టూర అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా ఉండాలి. అంతేగాకుండా ప్రధాన రహదారి, రహదారి గుండా నూతనంగా నిర్మించే నిర్మాణాల్లో కమర్షియల్ అయితే 10 ఫీట్లు, గృహ నిర్మాణాలు అయితే 5 ఫీట్లు సెట్​ బ్యాక్​ పద్దతిలో నిర్మించుకోవాలి. సెల్లార్​ తవ్వి వదిలేసిన ప్రాంతాలలో పరిసరాల్లోని నిర్మాణాలు పటిష్ఠంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు సెల్లార్​ గుంతను నిర్మాణ వ్యర్థాలతో నింపేయాలి. అయితే ఈ నిబంధనలు మాకు వర్తించవు అన్నట్టుగా బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం పక్కనే ఉన్న ప్రధాన రహదారిలో 60 నుంచి 200 గజాల స్థలాలలో కూడా నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్​ కాంప్లెక్స్​లలో యధేచ్చగా సెల్లార్​ నిర్మాణాలు చేపడుతున్నారు.

అధికారుల కంటి తుడుపు చర్యల వల్ల కొన్ని వందల సంఖ్యలో తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనుమతుల కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్న అక్రమ సెల్లార్ల నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story