ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు..

by Sumithra |
ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు..
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో అసెంబ్లీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన చిన్న తనం నుండే ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు గడ్డం ప్రసాద్ కుమార్. తాండూర్ ప్రాంత వాసి అయిన ఆయన జూన్ 4, 1964 ఎల్లమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించారు. జహీరాబాద్ లో పాలిటెక్నిక్ చదువుకున్న ప్రసాద్ కుమార్, 1984లో జహీరాబాద్ ప్రభుత్వ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ గా ఎన్నికై యువ నాయకుడిగా ఎదిగాడు. 1992లో రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, 1998 మర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

2001 సంవత్సరంలో వికారాబాద్ జిల్లా, వికారాబాద్ నియోజకవర్గం, కోట్ మర్పల్లి ఎంపీటీసీగా గెలిచి, 2006 వరకు మర్పల్లి మండలం ఎంపీపీగా పని చేశారు. 2008 బై ఎలక్షన్ లో వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి, 2 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఓటమి పాలైన ఆయన, ఈ మధ్య జరిగిన 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో 3వ సారి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన నాయకులు. అలాంటి ఆయనకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు. ఎంపీటీసీగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగారు.

Advertisement

Next Story