తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్..!

by samatah |   ( Updated:2023-01-10 06:14:57.0  )
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్..!
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : ఐఏఎస్ అధికారి అంటే ఉన్నతమైన పోస్టు అనేది ఒకప్పటి మాట. కానీ నేటి తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి అంటే కేవలం అవినీతి ఆరోపణలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న పరిస్థితి ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పుడు ఐఏఎస్ అవ్వాలి అంటే పెట్టిపుట్టాలి అనే నానుడి ఉండేది. ఎంతో శ్రమిస్తే తప్ప ఐఏఎస్లో ఉత్తిర్ణత సాధించలేము. అందుకే విద్యార్థులు ఐఏఎస్ అనే లక్షాన్ని ముందుపెట్టుకుని అహర్నిశలు కష్టపడి చదివి చివరికి తమ లక్ష్యాన్ని సాధించేవారు. ఒక ఇంట్లో ఐఏఎస్ ఉంటే ఆ కుటుంబానికి ఇచ్చే గౌరవమే వేరు. అలాంటి మహోన్నతమైన ఐఏఎస్ అధికారులు నేటి తెలంగాణ ప్రభుత్వం అంగట్లో సరుకుల మిగిలారా..? ప్రభుత్వ పెద్దలతో కుమ్మకై సామాన్య ప్రజల కష్టాలు తీర్చే ఐఏఎస్ చివరికి అవినీతి అధికారులుగా ముద్ర వేసుకుంటున్నారా..? అంటే కొందరు కలెక్టర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలు చూస్తే నిజమే అనకుండా ఉండలేని పరిస్థితి.

తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్..!

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుండే జిల్లా కలెక్టర్ అనేక నిందారోపణలు ఎదుర్కుంటూ వస్తున్నారు. ప్రారంభంలో కలెక్టర్ అభివృద్ధికి సమయం ఇవ్వడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించగా, కొన్నిరోజుల తరువాత ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎకరాకు రూ.1 లక్ష చొప్పున కలెక్టర్ సమర్పించుకోవాల్సిందే అనే ఆరోపణలు గ్రామాలలో ఉండే సాధారణ రైతు నోటా సైతం వినబడే స్థాయికి వెళ్లడం గమనార్హం. అలాంటిది ఏమి లేదని ఆ మధ్య కలెక్టర్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అవినీతి ఆరోపణలు మాత్రం ఇప్పటికి కొనసాగుతున్న పరిస్థితి. ఒక ఐఏఎస్ అధికారిపై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం జిల్లా చరిత్రలోనే మొదటిసారి. ఒక కలెక్టర్ మీద అవినీతి ఆరోపణలు చేయడం అంత ఆషామాషీ కాదు. అలాంటిది ఎన్ని ఆరోపణలు వస్తున్న కలెక్టర్ మౌనంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇటువైపు ద్రుష్టి పెట్టినట్లు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి.

అధికార పార్టీ నేతల నుండి సైతం అవినీతి ఆరోపణలు..!

నిజానికి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో అసలు ఏం జరుగుతుంది..? అనేది నేడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎప్పుడు లేనిది ఒక కలెక్టర్ పై ఇన్ని ఆరోపణలలు వస్తుంటే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు నిద్రపోతున్నారా..? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజల నుండి ప్రతిపక్ష నేతలే కాకా, చివరికి అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం కలెక్టర్ నిఖిలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. గత ఆదివారం జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి సైతం కలెక్టర్ తీరును తప్పుబట్టారు. ఉన్నతమైన స్థానంలో ఉండి, జిల్లా పాలనను గాలికి వదిలేసి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, భూ సమస్యలు పరిష్కరించడంలో రైతులు ఉసురు పోసుకుంటున్నారని, జిల్లా అభివృద్ధికి కలెక్టర్ శాపంగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి.

కలెక్టర్ పై వస్తున్న ఆరోపణలలో నిజం ఎంత..?

కలెక్టర్ నిఖిలపై వస్తున్నభూ సెటిల్మెంట్ వ్యవహారంలో కేవలం ఆమె ఒక్కరే దోషి కాదని, దీనివెనుక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. సిఎస్ కార్యాలయం నుండి ప్రభుత్వ పెద్దలే కలెక్టర్లను ముందు పెట్టి ధరణి యాప్ తో రియల్ దందా నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైతులు తమ భూములను ఆన్లైన్ చేసుకోవడంలో భాగంగా, కలెక్టర్లకు లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు పట్టడం లేదని, అన్ని జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్న అవినీతి సొమ్ములో ప్రభుత్వ పెద్దలకు సైతం వాటాలు వెళ్తున్నాయి అనేది బహిరంగంగా వినిపిస్తున్న ఆరోపణ. తెర వెనక ఉన్న పెద్దలు ఏమి ఎరగనట్లు ఉంటే, తెర ముందు ఉన్న కలెక్టర్లు దోషులు అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్న కలెక్టర్ మౌనం వెనక ఆంతర్యం ఏంటి..? అనేది వంద డాలర్ల ప్రశ్నగా మారింది.

కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం..!

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల బదిలీకి రంగం సిద్ధం అయ్యిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత నాలుగు నెలల క్రితమే కలెక్టర్ బదిలీ ఉన్నప్పటికీ, జిల్లా పరిధిలో కొందరు ప్రభుత్వ పెద్దల భూ సెటిల్మెట్లకు సంబందించిన ఫైల్స్ కొన్ని పెండింగ్ లో ఉన్న కారణంగానే ఆమె బదిలీ ఆలస్యం అయ్యిందని, ఆ ఫైల్స్ పూర్తి కావడంతో ఆమె బదిలీకి రంగం సిద్ధం అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఆమె స్థానంలో మరో కలెక్టర్ బాధ్యతలు తీసుకోనున్నారని చర్చలు నడుతున్నాయి. ఏదిఏమైనా వచ్చే కలెక్టర్ అయినా నిజాయితీగా పనిచేస్తారా..? లేదా అని సామాన్య ప్రజలలో భయం మరింత పెరుగుతున్న పరిస్థితి.

Advertisement

Next Story