Badang Pet: మున్సిపల్ స్థలంలో అపార్ట్‌మెంట్లు..!

by Ramesh Goud |
Badang Pet: మున్సిపల్ స్థలంలో అపార్ట్‌మెంట్లు..!
X

దిశ, బడంగ్ పేట్​ : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో ప్రభుత్వ ఓపెన్​ స్థలాలు యధేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయి. వీధి చివర్లో చిన్న గుడిసె వేసినా వదలని టౌన్​ ప్లానింగ్​ అధికారులు కళ్ల ముందు ఓపెన్​ స్థలాల్లో పెద్ద పెద్ద అపార్ట్​మెంట్లు కడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారుల కబంధహస్తాల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయి. పేదోడిపై ప్రతాపం చూపెడుతున్న టౌన్​ ప్లానింగ్​ అధికారులు సంపన్నులకు రెడ్ కార్పెట్​ పరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడంగ్ పేట్​ కార్పొరేషన్​ టౌన్​ ప్లానింగ్​ అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మెకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. బడంగ్​ పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని 23వ డివిజన్​లోని బీరప్పకాలనీలో ఇందిరమ్మ పట్టాతో 30గజాల స్థలంలో నిర్మిస్తున్న రేకుల షెడ్డును కూల్చివేసిన టౌన్​ ప్లానింగ్​ అధికారులు, అదే డివిజన్​లోని సర్వే నంబర్ 79 లోని మారుతీనగర్​ కాలనీ రోడ్​ నంబర్​ 4లో 2200 గజాల ఓపెన్​ స్థలంలో నిర్మిస్తున్న రెండు పెద్ద అపార్ట్​ మెంట్​లు టౌన్​ ప్లానింగ్​ అధికారులకు కనిపించడం లేదా ? అని బీజే వైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. పెద్ద మొత్తంలో చేతులు మారడం కారణంగానే టౌన్​ ప్లానింగ్​ అధికారులు మిన్నకుండిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2200గజాల ఓపెన్​ స్థలాన్ని కబ్జా చేసి రెండు బడా అపార్ట్​మెంట్లు కడుతున్నారని బడంగ్ పేట్​ మున్సిపల్​ కమిషనర్​కు, రంగారెడ్డి జిల్లా అడిషనల్​ కలెక్ట ర్​కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు.

బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలోని ​ 23వ డివిజన్​ మారుతీనగర్​ కాలనీలో పట్టాదారు కర్రె బాలయ్య తమ బంధువులతో కలిసి వెంచర్​ చేశారు. మిగిలిన 3వేల గజాల్లో ఉన్న గజరాల కుంటను అప్పట్లో ఓపెన్​ స్థలం కింద వదిలిపెట్టారు. ఒక్కసారిగా బడంగ్‌పేట్​ కార్పొరేషన్​ పరిధిలో స్థలాల రేట్లు విపరీతంగా పెరగడంతో తిరిగి 3వేల గజాలలో వదిలిపెట్టిన గజరాల కుంటపై కన్ను పడింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సర్వే నంబర్ 79 లోని ​ 23వ డివిజన్​ మారుతీనగర్​ కాలనీ రోడ్​ నంబర్​ 4 లో 2200 గజాల ఓపెన్​ స్థలం ఉంది. 2018 లోనే ఆ ఓపెన్​ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు అప్పటి టౌన్​ ప్లానింగ్​ అధికారి విజయశ్రీ ఆ స్థలాన్ని పరిశీలించి, అది ప్రభుత్వ స్థలంగా గుర్తించి, ఆస్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఓపెన్​ స్పేస్​ కింద వదిలిన స్థలాన్ని సదరు యజమానిగా చెప్పుకునే వ్యక్తి మరికొంతమందితో కలిసి రాజేంద్రనగర్​కు చెందిన మరో వ్యక్తికి విక్రయించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రెండు భారీ అపార్ట్​మెంట్లు నిర్మిస్తున్నారు. అయితే సదరు స్థలం విక్రయించడంలో స్థానిక నాయకులతో పాటు పలువురు కార్పొరేటర్ల హస్తం కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమిషనర్​కు, అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు..

బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలోని ​ 23వ డివిజన్​ సర్వే నంబర్ 79 లోని మారుతీనగర్ రోడ్​ నంబర్​ 4 లోని 2200 గజాల ఓపెన్ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మొట్ట మొదటి సారిగా 1-7-2024లో బడంగ్ పేట్​ మున్సిపల్​ కమిషనర్​కు కార్పొరేషన్​ బీజేవైఎం అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్​ కమిషనర్​ గానీ టౌన్​ ప్లానింగ్​ అధికారులు పట్టించుకోకపోవడంతో రంగారెడ్డి జిల్లా అడీషనల్​ కలెక్టర్​ కు 6-7-2024 న ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా సరైన స్పందన రాకపోవడంతో తిరిగి రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రెండో సారి 5-11-2024 న బడంగ్ పేట్​ మున్సిపల్​ కమిషనర్​ సరస్వతికి ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు పట్టించుకోపోవడంతో తిరిగి 2-12-2024న రెండవ సారి అడిషనల్​ కలెక్టర్​ కు ఫిర్యాదు చేశారు.

హైడ్రాకు ఫిర్యాదు చేస్తాం..

కోట్లాది రూపాయల విలువైన 2200 గజాల ఓపెన్​ స్థలంలో బహుళ అంత స్తుల భవనాలను నిర్మిస్తున్నారని రెండు సార్లు బడంగ్ పేట్​ కమిషనర్​కు, రెండు సార్లు అదనపు​ కమిషనర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బడంగ్ పేట్​ బీజేవైఎం అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఓపెన్​ స్థలం కాకపోతే 2018లో అప్పటి టౌన్​ ప్లా నింగ్​ అధికారి విజయశ్రీ ప్రభుత్వ సూచిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రభుత్వ స్థలం .. ఇప్పుడు ప్రైవేట్​ స్థలం ఎలా అవుతుందన్నారు. 2021లో ఆ ప్రభుత్వ స్థలంలో కాలనీ వాసులు దేవుడి ప్రతిమను ఏర్పాటుచేసుకుంటుంటే స్థల యజమానిగా చెప్పుకునే వ్యక్తి మీర్​పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశా డని, దీంతో కాలనీకి చెందిన 11మంది పై ట్రెస్​ పాస్​ కేసులు పెట్టి బెదిరించారని చెప్పారు. తిరిగి ఆ కేసులు ఉపసంహరించుకోవాలంటే ఆ స్థలంతో మాకు సంబంధంలేదని రాసిస్తే కేసులు ఉప సంహరించుకుంటానని స్థలయజమానిగా చెప్పుకునే వ్యక్తి బెదిరించడంతో చేసేదిలేక ఆ 11 మంది రాసిచ్చారని వివరించారు. ఆర్​టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా అది పక్కాగా సర్వేనంబర్​ 79లోని మారుతీనగర్​లో 2188.18 గజాల ఓపెన్​ స్థలమేనంటూ బడంగ్​ పేట్​ నగర పాలక సంస్థ కూడా ధృవీకరించిందన్నారు. ఇప్పటికయినా సంబంధిత అధికారులు ఆస్థలంలో వెలిసిన అక్రమకట్టడాలను కూల్చివేసి, ఆస్థలాన్ని కాలనీ స్వప్రయోజనాల కోసం అప్పగించక పోతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed