పన్నులు చెల్లించడంలో తండాలే పస్ట్​..

by Sumithra |
పన్నులు చెల్లించడంలో తండాలే పస్ట్​..
X

దిశ, పరిగి : పన్నులు సకాలంలో చెల్లిస్తే మరింత అభివృద్దికి దోహదపడుతుంది. ఇందు కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపల్​ సిబ్బంది, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు 100 వసూలు చేయాలని టార్గెట్లు ఇచ్చి మరీ వసూలు చేస్తుంటారు. పరిగి మున్సిపల్​ లో అత్యధికంగా 2 కోట్ల 20 లక్షల 61 వేల పన్నులు బకాయి ఉన్నాయి. ఇందులో 2021–22 సంవత్సరానికి ముందువి 94 లక్షల 15 వేల రూపాయాలు పన్నులు చెల్లించాల్సి ఉండగా, ఈ సంవత్సరం 2022–23 1 కోటి 4 లక్షల 70 వేల రూపాయల పన్నులు చెల్లించాల్సి ఉంది. కాగా పరిగి మున్సిపల్​ లోనే అత్యధికంగా ఒక పాఠశాల 8 లక్షల రూపాయలు పన్ను(టాక్స్​ ) కట్టాల్సి ఉంది. మరో కళాశాల 7 లక్షలు, మరో పాఠశాల 2 లక్షల రూపాయల ఇంటి పన్ను కట్టాల్సి ఉంది.

మున్సిపల్​లో ఏడాది రెండు సార్ల చెల్లిస్తే..వడ్డీ ఉండదు

పరిగి మేజర్​ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఇంటి పన్నులకు వడ్డీలు వేగవంతంగా పెరిగి పోతున్నాయన్న విషయం మున్సిపల్​ ప్రజలు గమనించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలో ఏడాది ఒక సారి పన్ను లెక్కిస్తే.. మున్సిపల్​ లో మాత్రం 6 నెలలకు ఒక సారి పన్ను లెక్కిస్తుంటారు. ఇప్పటి వరకు మున్సిపల్​ పరిధిలో ఉన్న ప్రజలు ఏడాది ఒక సారి ఫిబ్రవరి, మార్చి నెలలో కట్టుకుంటూ వస్తున్నారు. కాని మనకు తెలియకుండానే ఏడాదికి ఒక సారి పన్ను కట్టడం వల్ల వడ్డీ కూడా కలిపి కట్టాల్సి వస్తుందన్న విషయం ప్రజలు గమనించాలి.

మండల వ్యాప్తంగా 32 గ్రామ పంచాయతీల్లో 54 లక్షల 67 వేలు బకాయి

పరిగి మండలంలో 37 గ్రామ పంచాయతీలుండగా అందులో 5 గ్రామపంచాయతీలు మినహా మిగతా 32 గ్రామ పంచాయతీల్లో 54 లక్షల 67 వేల రూపాయల పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్నులు వసూలు చేయాలంటూ ఎంపీడీఓ విజయప్ప, ఈఓఆర్డీ దయానంద్​ పంచాయతీ కార్యదర్శులకు రోజూ ఆదేశాలు జారీ చేస్తూ వసూలుకు పురుమాయిస్తున్నారు.

పన్నులు చెల్లించడంలో తండాలు బేష్​

పన్నులు చెల్లించడంలో తండాలు బేష్​ అని గొప్పగా చెప్పవచ్చు. హీర్యానాయక్​ తండా, మల్కాయపేట్​ తండా, నజీరాబాద్​ తండా, సాలిపల బాట తండా పేరు తండాలే అయినా అభివృద్దికి ఆ తండా వాసులు సహకరిస్తున్నారే చెప్పవచ్చు. రాఘవాపూర్​, బర్కత్​ పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా 100 శాతం పన్నులు చెల్లించి బేష్​ అనిపించుకున్నారు. వంద శాతం పన్నులు వసూలు కట్టించడంలోఆయా గ్రామాల సర్పంచులు తుల్జా నాయక్​, సాలిబాయి, నేనావత్​ గణేష్​, నల్క జగన్​, వెంకటయ్యలతోపాటు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శుల కృషి ఎంతగానో ఉంది.

పన్నులు చెల్లించి అభివృద్దికి సహకరించండి : జి.శ్రీనివాసన్​ ( పరిగి మున్సిపల్​ – కమిషనర్​ )

పరిగి మున్సిపల్​ పరిధిలోని 15 వార్డుల్లో సుమారు రెండు కోట్లకు పైగా పన్నులు చెల్లించాల్సి ఉంది. ఈ పన్నులను వెంటనే చెల్లిస్తే మున్సిపల్​ అభివృద్దికి దోపదం చేసినట్లు అవుతుంది. మున్సిపల్​ అయినాక పన్నులు ఎప్పటిదప్పుడే కట్టేస్తే వడ్డీ పడకుండా ఉంటుంది. అత్యధికంగా పరిగి మున్సిపల్​ పరిధిలో ఒక పాఠశాల 8 లక్షలు, మరో పాఠశాల 2 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంది. వారితో మాట్లాడగా త్వరలోనే కట్టేస్థామన్నారు. మున్సిపల్​ ప్రజలంతా కట్టాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీ పడకుండా ఉంటుంది. మన మున్సిపాలిటీని మరింత అభివృద్ది చేసుకునేందుకు వీలుంటుంది.

Next Story

Most Viewed