సమీపిస్తోన్న పుష్కరాలు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు

by Pooja |
సమీపిస్తోన్న పుష్కరాలు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్; జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో (Kaleswaram) అంతర్ భాగంగా ప్రవహించే స‌రస్వతీ న‌ది పుష్కరాలకు (Saraswati River Pushkarala) స‌మ‌గ్ర ఏర్పాట్లు చేయాల‌ని… ఈ పుష్కరాలకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్ర భ‌క్తులు కూడా వస్తారని, అందుచేత ఎవరికీ ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని రాష్ట్ర దేవాదాయ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో సమావేశంలో మాట్లాడుతూ.. సరస్వతీ నదికి వచ్చే ఏడాది(2025లో) పుష్కరాలు రానున్న సందర్భంగా, పుష్కరాల నిర్వహణకు అధికారులు ముందస్తు నివేదికలు సిద్ధం చేయాలని ఆమె పేర్కొన్నారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై అధికారులకు మంత్రి మార్గనిర్ధేశం చేశారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్నవారితో పాటు స్పెష‌ల్ గా కొంతమందిని నియమించాలని స్థానిక‌ క‌లెక్టర్ ని, ఈఓని ఆమె ఆదేశించారు. పుష్కరాలు జరిగే గోదావరి, దేవాలయ పరిసర ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద తాత్కాలిక, శాశ్వత మరుగుదొడ్లు నిర్మించాలని తెలిపారు. భక్తులు స్నానాల కోసం నల్లాలను, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతర విద్యుత్ స‌రఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కాళేశ్వరంలో అంతర్గత రోడ్లు తాత్కాలిక రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు నిబద్ధతతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని అన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరంలో అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆలయ ఈవో మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed