హలో సర్.. మీ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది?

by GSrikanth |
హలో సర్.. మీ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది?
X

‘సార్.. మీరెం చేస్తుంటారు? మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉన్నది? ప్రభుత్వ స్కీమ్‌లు ఎలా ఉన్నాయి? ఆశించిన స్థాయిలో డెవలప్‌మెంట్ కనిపిస్తున్నదా? మీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే‌గా ఎవరు గెలిస్తే బాగుంటుంది? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు?’ - భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఒకే రోజులో ఇలా నాలుగైదు కాల్స్ వచ్చాయి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రవేట్ సర్వే సంస్థలు మళ్లీ తమ పనులను మొదలుపెట్టాయి. పబ్లిక్​పల్స్​పట్టుకునే టెలీకాలర్స్ ద్వారా ఫోన్లు చేసి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. మీ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అంటూ నియోజకవర్గ ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. కొందరు స్పష్టమైన సమాధానాలు ఇస్తుండగా? మరి కొందరు మొరటుగా, వ్యంగ్యంగా జవాబులిస్తున్నారు. ఇంకొందరైతే ‘మీకెందుకు చెప్పాలి? నా వ్యక్తిగత అభిప్రాయాలను షేర్​చేసుకోలేను’ అంటూ సింపుల్‌గా కాల్ కట్​చేస్తున్నారు. ఇది కేవలం ఒక్క జిల్లాకే పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఓటర్లకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. మెజార్టీ ప్రజలు ఆన్సర్లు ఇస్తున్నట్లు ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలు చెబుతున్నాయి. వీటిని కేటగిరీలుగా అనాలసిస్ చేసి అభ్యర్థులకు రిపోర్టులు పంపుతామని స్పష్టం చేస్తున్నాయి. దాని ప్రకారం సదరు అభ్యర్ధులు ఎలక్షన్​స్ట్రటజీస్‌ను ఫాలో అవుతారని పేర్కొంటున్నాయి.

నియోజకవర్గాల వారీగా ఆఫీసులు

నియోజకవర్గాల వారీగా సర్వే సంస్థలకు సపరేట్‌గా ఆఫీసులూ ఓపెన్ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో అభ్యర్థులంతా అలెర్ట్​అయ్యారు. ప్రత్యేకంగా టెలీకాలర్​వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. టెలీకాలర్స్​ద్వారా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న డెవలప్‌మెంట్స్, స్కీమ్స్‌లపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. వివిధ పథకాల పేర్లు చెబుతూ టెలీకాలర్స్​ఫీడ్​బ్యాక్​తీసుకుంటున్నారు. ఎక్కువ ఏ పథకాన్ని రేటింగ్ వస్తుందనే విషయాన్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. అభ్యర్థులు, పార్టీ పేర్లనూ ప్రస్తావిస్తూ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారి విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? అనేది కూడా తెలుసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలతో మొదలు ప్రతిపక్ష పార్టీలు, ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే వారు, టిక్కెట్ల రేసులో ఉన్న వారంతా సర్వేలను విస్తృతంగా చేయిస్తున్నారు. మిగతా వాళ్లతో పోల్చితే అధికార పార్టీలకు చెందిన వారు కాస్త ముందుగా సర్వేలు చేయిస్తుండటం గమనార్హం. అర్బన్‌తో పాటు రూరల్​జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

సిట్టింగులపైనా..

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పనితీరు​ఎలా ఉన్నదనే విషయాన్నీ సర్వే సంస్థలు ఆరా తీస్తున్నాయి. గతానికి, ఇప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో మార్పులు వచ్చాయా? లేదా? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మెజార్టీ ప్రజల కోసం చేసిన మేలు, స్కీమ్‌లు ఏంటి? ఎక్కువ మందికి అసంతృప్తిని కలిగించిన అంశాలు ఏంటి? అనే అంశాలపై పబ్లిక్​అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. కొందరు టెలీకాలర్స్​అత్యుత్సాహాన్ని ప్రదర్శించి గతంలో ఏ పార్టీకి ఓటు వేశారు? ఇప్పుడు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు కూడా వేస్తున్నట్టు ప్రజలు చెబుతున్నారు.

కేటగిరీలుగా విభజించి....

సర్వేలో వచ్చిన మెజార్టీ అభిప్రాయాలను ప్రైవేట్ సంస్థలు అభ్యర్థులకు నివేదిక రూపంలో అందజేస్తున్నాయి. స్కీమ్‌లు, వ్యక్తుల పర్మామెన్స్, ఏ వర్గం (ఉద్యోగాలు, వ్యాపారులు ఆధారంగా) ఎవరివైపు మొగ్గు చూపుతున్నది? అనే అంశాలను క్రోడీకరిస్తున్నారు. మహిళలు, యువత, మెజార్టీ విద్యార్థుల ఆలోచనలను కూడా అన్వేషించి నివేదికల్లో పొందుపరుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు స్కీమ్స్ ఆధారంగా వస్తున్న రేటింగ్, వ్యక్తిగతంగా వస్తున్న ఇమేజ్, సవాళ్లు, చిక్కులు వంటి వాటిపైనా సపరేట్‌గా సర్వే రిపోర్టులు ఇస్తున్నామని ఓ ప్రైవేట్​సంస్థ వెల్లడించింది. ఇక ప్రతిపక్ష పార్టీలు, టిక్కెట్ల రేసులోని అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు కూడా స్పష్టమైన నివేదికలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఓ సర్వే సంస్థ మేనేజర్​పేర్కొన్నారు.

సర్వే కోసం ట్రైనింగ్

ప్రభుత్వంలోని అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలలోని క్యాండియేట్స్ నిక్కచ్చి నివేదికల కోసం ఆరాటపడుతున్నారు. దీంతో చాలా సర్వే సంస్థలు గతంతో పోల్చితే రీసెర్చ్​శాంపిళ్ల సైజును 10 నుంచి 20 శాతం పెంచినట్టు తెలిసింది. ప్రజల నుంచి దీటుగా స్పష్టమైన సమాచారాన్ని రాబట్టేందుకు కొన్ని సర్వే సంస్థలు టెలీ కాలర్స్​‌కు ట్రైనింగ్ కూడా ఇప్పించాయి. మరికొన్ని సంస్థలు 85 నుంచి 90 శాతం మహిళలనే టెలీకాలర్స్‌గా తీసుకొని ఇన్ఫర్మేషన్​తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి తక్కువ కాలంలో పబ్లిక్​పల్స్‌ను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్న ఈ సర్వే సంస్థలు.. ఫీజులను కూడా భారీగానే వసూలు​చేస్తున్నాయని స్వయంగా అభ్యర్థులే పేర్కొనడం గమనార్హం.

ఎలక్షన్​ సమయంలో తప్పదు: అజయ్, ఓ ప్రైవేట్ సర్వే సంస్థ మేనేజర్

పబ్లిక్​పల్స్​పట్టుకునేందుకు సర్వే చేయించడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. అన్ని పార్టీలకు చేస్తున్నాం. పబ్లిక్​నుంచి ఫీడ్​బ్యాక్​తీసుకుని ఆయా పార్టీల ప్లస్, మైనస్​అంశాలను నివేదిక రూపంలో ఇస్తున్నాం. డిజిటల్ రంగం స్పీడ్​కావడంతో నేతలు కూడా సర్వేలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సర్వే రీజల్ట్స్​అబ్​నార్మల్​రాకుండా ట్రైన్డ్​స్టాఫ్‌తో మాత్రమే చేయిస్తున్నాం. క్యాండియేట్స్, శాంపిళ్ల సైజు, ప్రాంతాల పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సంస్థలు ఫీజులు నిర్ణయిస్తున్నాయి.

రెండు సార్లు సర్వే చేయించా: డాక్టర్​శ్రీనివాసరావు, జీఎస్సార్​ట్రస్ట్​వ్యవస్థాపకుడు

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించాలనే ఆసక్తితో గతంలో రెండు సార్లు సర్వే చేయించాను. దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నా. భవిష్యత్‌లోనూ ప్రజల ఆలోచన మేరకు ముందుకు వెళ్తా. ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థులు సర్వేలు చేయించడం సహజం. పనితీరుకు కొలమానంగా కూడా వీటిని భావించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed