- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యరంగంలో ఉమ్మడి నల్లగొండకు ప్రియారిటీ : హరీష్ రావు
దిశ, చౌటుప్పల్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలను కేటాయించారని అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ప్రకారం రూ.36 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి వెంట ఉన్నందున నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో విలువైన ప్రాణాలు కాపాడడం కోసం ఇక్కడ వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మర్రిగూడలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని మునుగోడు, నాంపల్లి, చండూరు, సంస్థాన్ నారాయణపురం పిహెచ్‌సిలను 24/7 గా అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.
పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క మెడికల్ కాలేజ్ ను నలగొండ జిల్లాకు సాధించలేక పోయారని విమర్శించారు. కేంద్రం బీబీనగర్‌లో ఎయిమ్స్ ప్రారంభించిన ఇప్పటికీ ఓపి సేవలు మినహా ఐపీ సేవలు అందుబాటులోకి రాలేదని అన్నారు. ఎయిమ్స్ తర్వాత ప్రారంభమైన నల్గొండ సూర్యాపేట మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించుకున్నామని అన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నత్తలు కూడా సిగ్గుపడేలాగా ఎయిమ్స్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
గత సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.1300 కోట్లతో పనులు నిర్వహించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరైడ్ తరిమికొట్టామని, ఇక్కడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో 120 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి,కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్సు పాస్, ఆసరా పెన్షన్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీబీనగర్, వలిగొండ పిహెచ్‌సీల కొత్త భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అదే విధంగా తంగళ్ళపల్లి పీహెచ్‌సీకి రూ.95 లక్షల రూపాయలతో ఆస్పత్రి భవనాన్ని ఆధునికరిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 3,500 ఎంబిబిఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.
వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు నీతి అయోగ్ కూడా ప్రశంసలు అందించిందని అన్నారు. పల్లె బస్తి దవఖానాలతో అద్భుతమైన వైద్య సేవలను అందిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాల సంఖ్యను 500 కు పెంచుతామని అన్నారు. గ్రామాలలోని ఏఎన్ఎం సబ్ సెంటర్ లను పల్లె దవాఖానాలుగా మార్చి గ్రామాలలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. జిల్లాలో 65 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే కేసీఆర్ కిట్ దేశానికి ఆదర్శమని,ఈ నెలలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. నల్గొండ, సూర్యాపేటలో వైద్య పీజీ కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం తప్ప కొత్త ఆసుపత్రిలను నిర్మించలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదివేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలను నిర్మించామని అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. వచ్చే ఏడాది యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఎంబీబీఎస్ సీట్ల కోసం విదేశాలకు వెళ్లే వారని, కానీ ఇప్పుడు సొంత జిల్లాలోని వైద్య విద్యను అభ్యసించేలా మెడికల్ కాలేజ్ లని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.
పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా పెంచుతామని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందుకు 20 మెడికల్ కాలేజీలో ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 55 మెడికల్ కాలేజీలు ఉన్నాయని గుర్తుచేశారు. అదేవిధంగా చౌటుప్పల్లో ఏర్పాటు చేయబోయే వంద పడకల ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ని ప్రారంభించి ఇక్కడే ఎమర్జెన్సీ సేవలు అందేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, డిఏంహెచ్ఓ మల్లికార్జున్ రెడ్డి,ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ అలివేలు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు సర్పంచులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.