- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.కోట్లు విలువజేసే 'దేవుడి భూమి' కబ్జా.. టీఆర్ఎస్ నేత అండతో మితిమీరిన ఆగడాలు?
దిశ, శామీర్‌పేట్: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూబకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇన్నాళ్లు పేద, మధ్య తరగతి ప్రజల భూములు బలవంతంగా లాక్కుంటూ బీభత్సం సృష్టించిన అక్రమార్కులు.. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములకే ఎసరు పెట్టారు. దేవుడి సొమ్మే కదా.. కబ్జా చేస్తే అడిగే వారు ఉండరనుకోని ఏకంగా 16 ఎకరాల మాన్యాన్ని కబ్జా చేశారు. వీరికి అధికార యంత్రాంగం పూర్తిగా మద్దతు ఇవ్వడంతోనే వారి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
16 ఎకరాల దేవాదాయశాఖ భూమి స్వాహా..?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరాయాంజల్‌లో సర్వే నెంబర్.639లో శ్రీ సీతారామచంద్ర స్వామి పేరుమీద 16 ఎకరాల మన్యం భూమి ఉంది. ఈ భూమి నగరానికి సమీపంలో ఉండడంతో కొంతమంది దేవుడి భూమి అని కూడా లెక్కచేయకుండా కబ్జాకు పూనుకున్నారు. రాత్రికి రాత్రే కొన్ని గుడిసెలు ఏర్పాటు చేసుకొని.. మెల్లి మెల్లిగా కబ్జా చేస్తూ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 60 గజాల ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూమి విలువ సుమారు వందల కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విచిత్రమేమింటే ఇందులో గుడిసెలు వేసుకున్న వారిలో ఒక్కరు కూడా దేవరయాంజాల్ గ్రామానికి చెందిన వారు లేకపోవడం గమనార్హం. అందరూ కామారెడ్డి సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. వీరికి స్థానికంగా ఉన్నటువంటి కొందరు మద్దతు ఇస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దేవుడి భూమిని కబ్జా చేసిన బకాసురులు కోట్లు దండుకుంటున్నా.. అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగానికి చేతులు తడిపితే స్వాహా చేయడానికి అనుమతి ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
తెరవెనుక చక్రం తిప్పుతోన్న కీలక నేత?
ఈ భూకబ్జాలో తెర వెనుక చక్రం తిప్పుతున్నది ఎవరు..? ఎవరికి భయపడి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, కూల్చివేతలకు సైతం తెగబడే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులపై ఎవరో కీలక నేత ఒత్తిడి చేస్తు్న్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ప్లాన్ ప్రకారం కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కబ్జాల విషయమై స్థానికులు పలుసార్లు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. 'బంగారు తెలంగాణ అంటే ఇదేనా.. బంగారు తెలంగాణలో దేవుడి మాన్యాన్ని సైతం వదలరా?' అని ప్రజలు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో స్థానిక మంత్రి మల్లారెడ్డి కూడా ఈ ప్రదేశంలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారని, ఇది దేవాదాయ భూమి అని మల్లారెడ్డికి తెలియదా? లేదా ఇదంతా మంత్రి సంబంధించిన అనుచరులే చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. అంతేగాకుండా.. ఆ ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టినా వారిపై దాడి చేయిస్తున్నారని, అటు వైపుగా ప్రయాణించాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కబ్జాకోరుల నుంచి అధికారులకు భారీగా ముడుపులు వస్తున్నాయని అందుకే ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని ఆరోపిస్తు్న్నారు.
అధికారుల సమన్వయ లోపం..?
ఇప్పటికే విద్యుత్ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతుంటే.. దేవుడి మాన్యంలో(సర్వే నెంబర్.639) విద్యుత్ స్తంభాలు, ఎవరు పర్మిషన్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికి విద్యుత్ మిటర్ ఆడిగితేనే డీడీ తీసుకోవాలి, అనుమతులు తీసుకోవాలి అని సాకులు చెప్పే అధికారులు ఆ భూమిలో విద్యుత్ కలెక్షన్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ముడుపులు ముట్టాకే అధికారులు అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యమే కబ్జాకోరులకు అవకాశం ఇస్తోందని ఆరోపిస్తున్నారు. దేవుడి మాన్యంలో వెంటనే కూల్చివేతలు ప్రారంభించి, నిర్మాణాలను అడ్డుకోకపోతే జిల్లా కాలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారి వివరణ
అక్కడ దొంగతనంగా పోల్స్ పాతారు. విద్యుత్ శాఖ నుంచి వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపేస్తాము. ఇప్పటికే రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చాము. వాళ్లు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఒకటే మా చేతుల్లో ఉంటుంది. = సురేందర్ (విద్యుత్‌శాఖ ఏఈ)
మున్సిపల్ కమిషనర్ వివరణ...
అక్కడ జరిగే నిర్మాణాలకు, మాకు సంబంధం లేదు. నిర్మాణాలు చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. దేవాదాయ భూములను కాపాడాల్సింది దేవాదాయశాఖ అధికారులు. నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్‌కి సమాచారం ఇస్తాము. = మున్సిపల్ కమిషనర్ జేతురాంనాయక్ (తూముకుంట)
జిల్లా అదనపు కలెక్టర్ వివరణ
సర్వే నెంబర్ అంతగా తెలియదు కానీ, కబ్జా జరిగిందని ఫిర్యాదు వచ్చాయి. పోలీసుశాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు గణేష్ నిమజ్జనాల్లో ఉన్నామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఎంఆర్వో ఆర్డీవోను సంప్రదించాలని కోరారు. = ఏనుగు నర్సింహారెడ్డి (జాయింట్ కలెక్టర్)