Ponguleti Srinivasa Reddy : భట్టి పాదయాత్ర శిబిరానికి పొంగులేటి.. సీఎం కేసీఆర్‌పై ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 07:42:44.0  )
Ponguleti Srinivasa Reddy : భట్టి పాదయాత్ర శిబిరానికి పొంగులేటి.. సీఎం కేసీఆర్‌పై ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించడం కోసం నాలుగు మెట్లు దిగేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోసపూరిత మాటలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గురువారం నల్గొండ జిల్లా కేతేపల్లిలో పొంగులేటి పరామర్శించారు.

ఈ సందర్భంగా భట్టితో ప్రత్యేకంగా భేటీ అయిన పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక, ఖమ్మం సభపై చర్చించినట్లు తెలిసింది. పొగులేటితో పాటు భట్టి శిబిరానికి బీఆర్ఎస్ నేత పిడమర్తి రవి కూడా రావడం హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని.. కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు క్షమించరన్నారు.

ఏదో సీట్ల కోసమో, అధికారం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని మాయపూరిత, మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ఇంటికి పంపించడానికి పార్టీ నేతలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌లోని తాను కొత్తగా వస్తున్నానని నల్గొండ రాజకీయాల్లో చేరికలపై తన ప్రమేయం ఉండబోదన్నారు. అటువంటి ఆలోచన కూడా తనకు లేదని ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా సీనియర్లకు పొంగులేటి విజ్ఞప్తి చేశారు. వేముల వీరేశం, శశిధర్‌ల చేరిక పార్టీ పెద్దలు నిర్ణయిస్తారన్నారు. తన చేరిక సభపై పార్టీ పెద్దలనే తుది నిర్ణయం అన్నారు.

పొంగులేటిని స్వాగతిస్తున్నా: భట్టి

తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని భావించి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న పొంగులేటిని ఆయన మిత్రులను తాను సీఎల్పీ పక్షాన స్వాగతిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. చేరికల విషయంలో పార్టీ నేతల మధ్య ఎటుంటి గ్యాప్ లేదని నిన్న జూపల్లి నివాసానికి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి తనకు సమాచారం ఇచ్చారన్నారు. పొంగులేటి చేరిక సభ తేదీని రాహుల్ గాంధీతో భేటీ అనంతరం నిర్ణయిస్తామన్నారు.

పొంగులేటి చేరికతో ఖమ్మం సీట్ల సర్దుబాటు పై స్పందించిన భట్టి.. పార్టీలో అభ్యర్థుల పని తీరుపై సర్వే ఆధారంగానే టికెట్లు వచ్చిన వారందరి గెలుపు కోసం అంతా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యం అన్నారు. అంతే తప్ప సీట్ల కేటాయింపులు వారికా. మాకా అనేది అప్రాధాన్యత అంశాలన్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా పార్టీ పెద్దలు పరామర్శించడం లేదన్న విమర్శలపై రియాక్ట్ అవుతూ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, వెంకట్ రెడ్డిలు తరచూ ఫోన్‌లో పరామర్శిస్తూనే ఉన్నారని ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా ప్రత్యర్థులు సృష్టిస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed