షర్మిల పార్టీలో చేరి గొంతు కోసుకోలేను.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Javid Pasha |   ( Updated:2023-04-14 12:35:12.0  )
షర్మిల పార్టీలో చేరి గొంతు కోసుకోలేను.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ తో బంధం తెగిపోయింది. దీంతో ఆయన దారెటు అనేదానిపై రోజుకో ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని, సందర్భం చూసి కండువా కప్పుకోవడమే ఆలస్యం అని కొంతమంది ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ సైతం ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పై అసమ్మతి రాగం వినిపిస్తున్న పొంగులేటిని ఇక సహించేది లేదని ఇటీవలే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.

అయితే గతంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న పొంగులేటి భవిష్యత్ లో కేసీఆర్ కు తనంటే ఏంటో చూపించబోతున్నారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున లోక్ సభకు ఎన్నికైన పొంగులేటి అనంతరం జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గానీ 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గాని ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంగతిని పొంగులేటి తాజాగా వివరించారు.

జగన్ అడిగినా కేసీఆర్ నో చెప్పారు

సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు తిరిగి పార్టీ టికెట్ వస్తుందని భావించిన పొంగులేటికి కేసీఆర్ మొండిచేయి చూపించారు. అయితే 2019లో లోక్ సభ టికెట్ తనకు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ను కోరినా దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. తనను కాదని ఇతరులకు టికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను చెప్పినా కేసీఆర్ వినకపోవడంతో అది జగన్ మనసులో ఉండి ఉంటుందేమో అని పొంగులేటి చెప్పుకొచ్చారు. కేసీఆర్ తడిబట్టతో తన గొంతు కోశారని ఈ బాధ అనుభవించినోడికే తెలుసని అన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి పెద్ద ఎత్తున ఉందని సందర్భం వచ్చినప్పుడు ఆ అవినీతి సిస్టం ఎలా ఉంటుందో తప్పకుండా వివరిస్తానన్నారు.

మెంటల్ గా సిద్ధం అయ్యే తాను నిర్ణయం తీసుకున్నానని ఎంత దూరం వెళ్లేందుకైనా రెడీగా ఉన్నానన్నారు. కేసీఆర్ ఎదుట లేని గౌరవం నటించడం తన వల్ల కాదని, పార్టీ నుంచి సస్పెండ్ తో దొరల గడి నుంచి విముక్తి లభించినట్లుగా ఉందన్నారు. రావణాసురుడి కబంధ హస్తం నుంచి భద్రాద్రి రాముడి పాదాల వద్దకు చేరుకున్నట్లుగా అనుభూతి కలుగుతుందన్నారు.

కోపంతో షర్మిల పార్టీలో చేరలేను

షర్మిల పార్టీలో చేరడంపై పొంగులేటి ఈ ఇంటర్వ్యూలో స్పందించినట్లుగా ప్రోమోలో ఉంది. తాను వైఎస్సార్ టీపీలో చేరకపోడవంపై షర్మిల కోపంతో ఉందని జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అవుతూ కోపంతో ఉందని చెప్పి నేను పార్టీలో చేరలేనని ఆ పార్టీలో చేరి తన గొంతు కోసుకోలేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ లక్ష్యంతో బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం కలిగిన పార్టీలోనే చేరుతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్ గా కొనసాగుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed