బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్..!

by Satheesh |   ( Updated:2023-06-20 11:20:24.0  )
బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్..!
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. చాలా కాలం తర్వాత, అనేక సందిగ్ధాల నడుమ అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 20వ తేదీ లేకుంటే 25న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఇప్పటికే పొంగులేటి అనుచరులకు సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండింట్లో ఏదో ఒక రోజున ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం.

ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ అమెరికా పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసి ప్రకటించనున్నట్లు పొంగులేటి అనుచరులు చెబుతున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు కూడా ఖమ్మం సభలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేవిధంగా సుమారు 5లక్షల మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం. ఏది ఏమైనా పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇప్పటికే బలమైన క్యాడర్ ఉంది. పొంగులేటి చేరికతో అది ఇంకా మరింత బలోపేతం కానుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో పొంగులేటి టీం బలమైన పోటీ ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు.

కొత్తగూడెంలో బరిలో పొంగులేటి..?

పొంగులేటి కొత్తగూడెం బరిలో నిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలైనట్లు తెలుస్తోంది. అక్కడ పొంగులేటి క్యాంప్ కార్యాలయం కూడా నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేస్తే రాష్ట్రస్థాయి నుంచి బీఆర్ఎస్ శక్తులన్నీ ఏకమయ్యే అవకాశం ఉన్నందున తను కొత్తగూడెం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మూడు జనరల్ స్థానాలు. వీటిలో ఖమ్మం నుంచి పొంగులేటి అనుచరుల్లో ఒకరైన దొడ్డా నగేష్ యాదవ్ తానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేయగా.. పాలేరు నుంచి షర్మిల పోటీకి దిగితే తనకు మద్దతు ఇచ్చేందుకు శ్రీనివాసరెడ్డి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story