కేటీఆర్ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్!

by Rajesh |
కేటీఆర్ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : 'సిరికొండ మండ‌లికి.. గండ్ర అసెంబ్లీకి' అంటూ బీఆర్ఎస్ భూపాల‌ప‌ల్లి బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి. గండ్ర ర‌మ‌ణారెడ్డి, గండ్ర జ్యోతి స‌భ‌లో ప్రసంగిస్తుండ‌గానే సిరికొండ అనుచ‌రులు, అభిమానులు ఆయ‌న‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అలాగే సిరికొండ ప్రసంగిస్తుండ‌గా స‌భ నినాదాల‌తో హోరెత్తింది.

ప‌లుమార్లు ఆయ‌న వారించిన ఆయ‌న అనుచ‌రులు, అభిమానులు ఆగ‌లేదు. అయితే ఆ త‌ర్వాత మంత్రి కేటీఆర్ ప్రసంగం ముగింపులో టికెట్ విష‌యంలో క్లారిటీ ఇస్తున్నట్లుగా సిరికొండ మండ‌లిలో.. గండ్ర అసెంబ్లీలో అంటూ చేసిన వ్యాఖ్యలను మాజీ స్పీక‌ర్ అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వాస్తవానికి భూపాల‌ప‌ల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన స‌భ స‌క్సెసే కానీ అంటూ మంత్రి కేటీఆర్ టికెట్ ప్రస్తావ‌న తీసుకువ‌చ్చి అన‌వ‌స‌ర‌మైన రాజ‌కీయ చిచ్చు ఇప్పుడే ర‌గిల్చార‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్యక్తమ‌వుతోంది.

రూ.297.32కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు గురువారం భూపాల‌ప‌ల్లికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధుసూదన్ చారి పాల్గొన్నారు.

గండ్రకు వ్యతిరేకంగా నిర‌స‌న స్వరాలు..!

మాజీ స్పీక‌ర్‌, ఎమ్మెల్సీ మ‌ధు సూద‌న‌చారిని హెలీప్యాడ్ వ‌ద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవ‌డంపై ఆయ‌న వ‌ర్గీయులు, అభిమానులు తీవ్రంగా ఆక్షేపించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో గండ్ర ర‌మ‌ణారెడ్డి ప్రసంగిస్తుండ‌గా సిరికొండ‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ త‌ర్వాత కేటీఆర్ మాట్లాడుతూ సిరికొండ‌, గండ్ర ఇద్దరు స‌మ‌ర్థులేన‌ని, ఎవ‌రేంటో కేసీఆర్‌కు బాగా తెలుసంటూ న‌ర్మగ‌ర్భమైన వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

అసెంబ్లీలో గండ్ర..శాస‌న‌మండ‌లిలో సిరికొండ ఉంటారంటూ వ్యాఖ్యలు చేయ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు గండ్ర ర‌మ‌ణారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి గండ్ర జ్యోతి ప్రసంగిస్తున్న స‌మ‌యంలో కొంద‌రు సిరికొండ‌కు అనుకూలంగా నినాదాలు చేయ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. అలాగే గండ్ర ర‌మ‌ణారెడ్డి ప్రసంగిస్తున్న స‌మ‌యంలోనే ఓ వృద్ధురాలు గండ్ర ర‌మ‌ణారెడ్డి డౌన్ డౌన్ అంటూ నిన‌దించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యానికి స‌మీపంలోని త‌న రెండెక‌రాల భూమిని గండ్ర ర‌మ‌ణారెడ్డి క‌బ్జా చేశాడ‌ని పేర్కొంది. వృద్ధురాలు ఆక్రోశంతో వెల్లడించిన దృశ్యాల వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారాయి.

విప‌క్ష నేత‌ల అరెస్టులు..

కేటీఆర్ ప‌ర్యట‌న‌లో పోలీసుల అతి చ‌ర్యలు క‌నిపించాయి. వంద‌లాది మంది పోలీసులు ప‌హారాతో భూపాల‌ప‌ల్లి ఖాకీల మ‌యంగా మారింది. మంత్రుల మెప్పు పొందేందుకో లేదో తెలియ‌దుగాని ముందు రోజు రాత్రి, తెల్లవారు జాము నుంచే భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌దుల సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌ను ముంద‌స్తుగా అరెస్ట్ చేసి స్టేష‌న్‌లో ఉంచారు. దీంతో వ్యక్తిగ‌త ప‌నుల మీద వెళ్తామ‌ని చెప్పినా పోలీసులు విన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముంద‌స్తు అరెస్టుల‌పై తీవ్రమైన విమ‌ర్శలు వ్యక్తమ‌య్యాయి. ఇదేం రాచ‌రిక పాల‌న అంటూ ప‌లువురు నేత‌లు మండిప‌డ్డారు.

మంత్రి వ‌ర్యా వ‌రాలేవీ..?

స‌మీప భ‌విష్యత్‌లో ఎన్నిక‌లు ఉండ‌డంతో మంత్రి కేటీఆర్ ప‌ర్యట‌నపై భూపాల‌ప‌ల్లి జిల్లా ప్రజ‌ల్లో అభివృద్ధికి నిధులు కేటాయింపుపై అంచ‌నాలు క‌నిపించాయి. అయితే మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు, మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు భూపాల‌ప‌ల్లి అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ ప్రక‌ట‌న‌లు చేశారు.

ఇక అభివృద్ధిపై కేటీఆర్ పాత ప‌ల్లవినే కొన‌సాగించార‌న్న విమ‌ర్శలు వినిపించాయి. గ‌తంలో ప్రక‌టించిన‌ మెడిక‌ల్ కాలేజీ విష‌యాన్ని ప్రస్తుతించ‌డం గ‌మ‌నార్హం. మంత్రుల హామీలు, నిధుల కేటాయింపు అంతాకూడా భూపాల‌ప‌ల్లి ప‌ట్టణం దాటి పోలేదు. క‌నీసం మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో మౌలిక వ‌స‌తుల మెరుగుకైనా మంత్రి కేటీఆర్ పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఉంటుందని ఆశ ప‌డిన జ‌నాల‌కు నిరాశే మిగిలింది.

రూ. 297.32 కోట్ల ప‌నుల‌కు..

భూపాల‌పల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రూ.297.32 కోట్ల విలువైన పలు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం భూపాల‌పల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌కు గణపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. గ‌ణ‌పురం చేరుకున్న కేటీఆర్ ముందుగా రూ. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, రూ.4కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు.

అనంతరం మంజూరు నగర్‌లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం రూ.229 కోట్లతో నిర్మించిన 994 క్వార్టర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లిలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని, సుభాష్‌నగర్ కాలనీలో రూ.14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ స్టాల్స్‌ను, దివ్యాంగుల కోసం ఏర్పాటు రూ.23 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్​ను ప్రారంభించారు. అనంతరం భాస్కర్ గడ్డలో రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించిన 544 డబుల్ బెడ్‌రూం ఇండ్ల‌ను మంత్రి ప్రారంభించారు.

పట్టణంలో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ.6 కోట్ల 80 అంచనాతో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, రూ.4.5 కోట్లతో చేపట్టే మినీ స్టేడియం నిర్మాణ పనులకు, రూ.కోటితో చేపట్టే జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ జక్కుల శ్రీ హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, అదనపు కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed