ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ వేడి

by Mahesh |
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ వేడి
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వనపర్తి‌లో ఈనెల 23న అధికార పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్‌ అడుగుల ముందుకు వేస్తున్నారు. వారి సారథ్యంలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు ఇటీవల అధికార పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరుకానుండడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ... బహిష్కృత నేతల మధ్య మాటల యుద్ధం జోరు అందుకుంది.

పట్టు సాధించుకునేందుకు కమలం పార్టీ వ్యూహం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంచి పట్టు సాధించుకునేందుకు కమలం పార్టీ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఈనెల 25న పాలమూరు పట్టణంలో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

రేవంత్ రెడ్డి రెండో విడత పాదయాత్రకు ప్లాన్

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రెండో విడత కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. అలంపూర్ లేదా.. గద్వాల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మీదుగా రేవంత్ రెడ్డి యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ యాత్రలో రేవంత్ రెడ్డి తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు సైతం హాజరుకానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్వ వైభవం తెచ్చుకోవాలనే సంకల్పంతో ఆ పార్టీ నాయకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టు సాధిస్తున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు సాగిస్తున్న కార్యక్రమాలు రసవత్తర రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed