- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోడు పంచాయితీ! అసెంబ్లీ వేదికగా ముహూర్తం ఫిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఏండ్లు గడుస్తున్నా తీరడం లేదు. అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఆదివాసీలకు, అటవీ శాఖ అధికారులకు మధ్య గతంలో ఘర్షణలు జరిగాయి. ఇటీవలి కాలంలో గొత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సైతం చనిపోయారు. దీర్ఘకాలంగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన విజ్ఞప్తులను, సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న గతంలో ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ బైపోల్ సమయంలో 'ఇక్కడి నుంచే పట్టాల పంపిణీ మొదలుపెడతాం' అని హామీ ఇచ్చారు.
కానీ ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు మాత్రం రాలేదు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని ఈ నెల చివరి నుంచి పట్టాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో 2021 అక్టోబరు 9న అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పోడు పట్టాల పంపిణీపై సీఎం సమీక్షించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబరు 3వ వారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అడవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. తరలిస్తున్నప్పుడే సర్టిఫికెట్లు ఇచ్చి వ్యవసాయానికి నీటి సౌకర్యంతో పాటు, కరెంటు వసతులు కల్పిస్తామన్నారు. రైతుబంధు, రైతుబీమా కూడా అందజేయనున్నట్టు హామీ ఇచ్చారు. గతంలో అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చినందున ఇప్పుడు కార్యాచరణ మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. అడవి తప్ప లోపల ఎవరూ ఉండడానికి (నన్ ఈజ్ ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్) వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.
అడవులను ప్రాణంగా చూసుకుంటారు
ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా ఆదివాసులపై సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, అటవీ ఉత్పత్తుల కోసం మాత్రమే అడవులను ఉపయోగించుకుంటారు. పొయ్యిలోకి కట్టెలను వాడుకుంటారు.
వారి జీవన హక్కును ప్రభుత్వం కాపాడుతుంది. కానీ సమస్యంతా బయట నుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసే వారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం' అని సీఎం వ్యాఖ్యానించారు. ఆదివాసుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను అక్టోబరు (2021) మూడవ వారం మొదలుపెట్టాలని, అందులో వారు పేర్కొన్న అంశాల ఆధారంగా భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.
ఈ సమస్య ఉన్న జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేల సూచనలనూ తీసుకోవాలన్నారు. నవంబరు నెల నుంచి అటవీ భూముల సర్వేను మొదలుపెట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాత పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైంది. పలు దఫాలుగా సమావేశాలు జరిగినా.. సమస్య పరిష్కారం కాలేదు. పట్టాల పంపిణీ జరగలేదు.
2017 నాటికే 11% ఆక్రమణ
రాష్ట్రంలోని సుమారు 26.90 లక్షల హెక్టార్లలో.. 2.94 లక్షల హెక్టార్ల (10.95%) భూమి ఆక్రమణకు గురైనట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వెలువరించిన గణాంకాల్లో తేలింది. సుమారు 1968 గ్రామ పంచాయతీల్లో పోడు భూముల సమస్య ఉన్నదని, రెండు వేలకు పైగా గ్రామసభలు నిర్వహించి ఆదివాసీల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు అప్పటి కమిషనర్ తెలిపారు. విడివిడి వ్యక్తులుగా 1.83 లక్షల మందితో కాకుండా, సంఘాల (కమ్యూనిటీ) నుంచి 1.86 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఆ ప్రకారం 6.30 లక్షల ఎకరాల మేర భూమి ప్రజలు సేద్యం చేస్తున్నారని, 4.70 లక్షల ఎకరాల భూమి కమ్యూనిటీల ఆధ్వర్యంలో సేద్యంలో ఉన్నట్టు తేలిందన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత 93,494 మంది లబ్ధిదారులకు (3 లక్షల ఎకరాలు), 721 కమ్యూనిటీలకు (4.54 లక్షల ఎకరాలు) పట్టాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. వ్యక్తుల నుంచి వచ్చిన వాటిలో 80,890 దరఖాస్తుల (2.90 లక్షల ఎకరాలు)ను, కమ్యూనిటీల నుంచి వచ్చిన 1,682 (12 వేల ఎకరాలు) దరఖాస్తులను తిరస్కరించినట్టు వివరించారు.
ఆదివాసీల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 8,723 (40 వేల ఎకరాలు), కమ్యూనిటీల నుంచి వచ్చినవాటిలో 1,024 (4,562 కరాలు) దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు 2017 నవంబరు 30న అప్పటి కమిషనర్ ఆర్ లక్ష్మణ్ తెలిపారు. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ బదులిస్తూ.. 2018 తర్వాత సుమారు 28 వేల మంది ఆదివాసీల నుంచి దాదాపు 99 వేల ఎకరాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, జిల్లాస్థాయి కమిటీలు పరిశీలించిన తర్వాత కేవలం 4,248 ఎకరాలకు మాత్రమే అర్హత ఉన్నట్టు తేలిందన్నారు.
సాగర్ బైపోల్
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పోడు భూములకు పట్టాల పంపిణీ ఇక్కడి నుంచే మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అప్పటికే అసెంబ్లీలో, ప్రగతి భవన్‌లో సమీక్ష సందర్భంగా ఇలాంటి హామీనే ఇచ్చిన కేసీఆర్.. తాజాగా మరోసారి ఫిబ్రవరి చివరి నుంచే పంపిణీ అంటూ నొక్కిచెప్పారు. దీర్ఘకాలంగా నానుతున్న సమస్యకు పరిష్కారం దొరికినట్లేనా? లేక అఖిలపక్ష సమావేశం పేరుతో జాప్యం జరుగుతుందా? అనే అనుమానాలు అటు విపక్షాల్లో, ఇటు ఆదివాసీల్లో నెలకొన్నాయి.
భూమిలేని ఆదివాసీలకు గిరిజనబంధు కూడా ఇస్తామని మునుగోడు అసెంబ్లీ బైపోల్ సందర్భంగానూ, ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన గిరిజన-ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగానూ హామీ ఇచ్చారు. కానీ భూమి ఉన్న ఆదివాసీలెంతమంది? లేనివారెంతమంది అనే లెక్క ఇప్పటికీ వెల్లడి కాలేదు. అన్ని గణాంకాలూ సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇక పట్టాల పంపిణీ ప్రారంభం కావడమే తరువాయి అని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆదివాసీల్లో ఆశలు నెలకొన్నాయి.