- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లస్సా..? మైనస్సా..? ఆ నేతలపై KCR నజర్!
బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలు పక్క చూపులు చూస్తుండటంతో అధిష్టానం అలర్ట్ అయింది. అలాంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నది. అందుకు గల కారణాలేంటి? కేవలం టికెట్ దక్కకపోవడమేనా? లేక మరేదైనా రీజన్ ఉందా? అనే సమాచారాన్ని సేకరిస్తున్నట్టు టాక్. వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళితే పార్టీకి లాభమా? నష్టమా? అనే లెక్కలనూ వేస్తున్నది. పార్టీకి నష్టం కలిగే ప్రాంతాల్లో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిని సీనియర్లకు అప్పగించింది అధిష్టానం. దీనికి తోడు విపక్షాలు ఎవరి ద్వారా ‘ఆకర్ష్’ ను నడిపిస్తున్నారనే విషయంపైనా గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఏవిధంగా మారుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలు పార్టీని వీడుతున్నారనే మాటలు బహిరంగంగానే వినిపిస్తుండటంతో అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. దీనిపై ఆరా తీయడం మొదలైంది. పార్టీని వీడే లీడర్లలో ఎవరున్నారు? వారు వెళ్లిపోతే పార్టీకి లాభమా? లేక నష్టమా? అనే లెక్కలు షురూ అయ్యాయి. ఏయే నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు ఎంతమంది ఉన్నారనే జాబితా సిద్ధమవుతున్నది. పార్టీకి కలిగే నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రులు, సీనియర్ నేతలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ప్రతిపక్షాలు ఏ కారణంతో అసంతృప్తులకు గాలం వేస్తున్నాయి? ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తున్నాయి? అనే వివరాలను రాబట్టే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. విపక్షాల ‘ఆకర్ష్’ ఎత్తుగడల విషయాల సమాచారాన్ని జిల్లా నేతల నుంచి సేకరిస్తున్నారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనాల్లో చాలా చోట్ల అసంతృప్తి బహిర్గతమైంది. దీనికి నివారణ చర్యలు తీసుకోవడంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.
ఇతర పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంపైనే బీఆర్ఎస్‌లో లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి లీడర్లను పిలిపించుకున్న కేసీఆర్ వారి అసంతృప్తికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారు చేజారిపోకుండా రకరకాల హామీలు ఇస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ హామీలకు సంతృప్తి చెందని నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమైతే.. వారి ప్రభావం పార్టీపై ఏవిధంగా పడుతుందని లెక్కలు వేస్తున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత నుంచి బీఆర్ఎస్‌లో ఈ కసరత్తు ప్రారంభమైంది. పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలను ముందుగానే పసిగట్టి దానికి తగిన విరుగుడు వేయాల్సిందిగా పార్టీ సీనియర్లకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకం కావడంతో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో నెగెటివ్ ఏర్పడినా అది మరికొన్ని నియోజకవర్గాలకు పాకే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నది.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగా పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్‌బాబు, భద్రాచలం సెగ్మెంట్‌కు చెందిన వెంకట్రావు, సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మట్టా దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పాలేరుకు చెందిన స్వర్ణకుమార్ తదితర పలువురు పార్టీకి దూరం అయ్యారు. దీంతో ఇతర జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదన్న ఉద్దేశంతో దిద్దుబాటు, ముందుజాగ్రత్త చర్యలను పార్టీ మొదలుపెట్టింది. ఏయే జిల్లాల్లో ఇలాంటి నేతలు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకుంటున్నారు.
‘ఆకర్ష్’ పై ఆరా
విపక్షాలు ఎవరి ద్వారా ఆకర్ష్ వ్యవహారాన్ని నడిపిస్తున్నయనే విషయంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఏ నేతకు ఎలాంటి అసంతృప్తి ఉన్నదో గ్రహించి వారిని నిలుపుకోడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకరికంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నందున ముందుగానే ప్రకటన చేస్తే ఆశావహులు నిరాశతో పార్టీకి దూరమైతే మొదటికే మోసం వస్తుందని భావించిన అధినేత.. జాబితాను ఎన్నికలకు ముందే ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చినా.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కేవలం టికెట్ రానందువల్లనేనా నేతలు అసంతృప్తికి గురవుతున్నారా? లేక ఇతర కారణాలున్నాయా? అని జిల్లా నేతల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ఇతర పదవులు, కాంట్రాక్టు పనులు లాంటివి అప్పగిస్తే వారు శాంతించే అవకాశాలపైనా కసరత్తు జరుగుతున్నది. అసంతృప్త నేతలను ఏ రూపంలో కూల్ చేయవచ్చనేది అధిష్టానానికి సవాలుగా మారింది.
పార్టీని మరింత బలపరిచేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల రూపంలో కార్యక్రమాలు చేపడుతున్నా దానికి విరుద్ధంగా అసంతృప్తి, అసమ్మతి రాగాలు బయటపడుతుండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. గతంకంటే ఈసారి రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ తీవ్రంగా ఉన్న సమయంలో సొంత అసంతృప్తి నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఇబ్బందిగా మారుతున్నది. ఇటీవల అంతర్గతంగా చేయించుకున్న సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా.. ఇప్పటి నుంచే అసంతృప్తుల విషయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవనే అనుమానం చాలా మంది గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇతర పార్టీలతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిన వారి గురించి సైతం ఆరా తీయడం మొదలైంది.
ఎస్సీ, ఎస్టీలే అధికం?
దళితబంధు స్కీమ్ తీసుకొచ్చినా ఎస్సీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు సంతృప్తి వ్యక్తం చేయక పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇతర పార్టీల్లోకి వెళ్లాలనుకుంటున్న వారిలో ఎస్సీ, ఎస్టీ నేతలు ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. బీసీ నేతలు ఉన్నప్పటికీ వారు స్వల్పంగానే ఉన్నారని పార్టీ రాష్ట్రస్థాయి నేతలకు సమాచారం అందింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతోనే ఎస్టీ నేతల్లో అసంతృప్తికి ఉన్నదని అధిష్టానం అంచనాకు వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి పరిష్కారం చూపాలని నిర్ణయించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నేతలు చేరికల కోసం పన్నుతున్న వ్యూహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందిగా జిల్లా నేతలను అధిష్టానం అప్రమత్తం చేసింది.
Read more: