ప్రజల పన్నులతోనే మాకు వేతనాలు! టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ

by Geesa Chandu |   ( Updated:2024-09-05 17:30:44.0  )
ప్రజల పన్నులతోనే మాకు వేతనాలు! టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: ప్రజలు కట్టే పన్నులతో వేతనాలు తీసుకుంటున్న తాము, వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు వారికి బాసటగా నిలవడం తమ బాధ్యత అని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ అన్నారు. ఈ మేరకు గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు . తెలంగాణ ఉద్యోగుల జేఏసీ లో భాగస్వాములుగా ఉన్న సుమారు 205 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు కలిసి వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యావత్ ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ముందు బాధితులను ఆదుకోవడంలో ముందున్న జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు లకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. టీఎన్జీవో సుమారు 83 సంవత్సరాలుగా ఇతర సంఘాలకు మార్గదర్శకంగా ఉంటూ పని చేస్తోందన్నారు. సంఘాలెన్ని ఉన్నాయో, నాయకులు ఎవరు ఉన్నారో తెలియని నాయకులు తాము అందిస్తున్న విరాళాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆయన విమర్శించారు . టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులుగా ఆదుకోవడం తమ కర్తవ్యమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలో తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్, హైదరాబాద్ జిల్లా సహ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, కోశాధికారి జే బాలరాజ్, సభ్యులు కుర్రాడి శ్రీనివాస్, శ్రీధర్, కృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed