రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై పీసీసీ ఫోకస్.. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న మహేశ్ గౌడ్

by karthikeya |
రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై పీసీసీ ఫోకస్.. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న మహేశ్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా నెల క్రితం బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్ గౌడ్ త్వరలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తాజా పరిస్థితిని అంచనా వేసిన ఆయన.. త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారికి సంస్థాగత వ్యవహారాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ల పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించేందుకు కృషిచేసేవారికి బాధ్యతలను అప్పజెప్పాలని చూస్తున్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి ఇటీవల ముగిసిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తగిన అవకాశాలు రానివారికి పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలను ఇచ్చేలా ఆలోచిస్తున్నారు. తొలుత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కమిటీ (డీసీసీ)లపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటివరకూ ఉన్న దాదాపు అన్ని కమిటీలు రద్దు కావడంతో కొత్త కమిటీను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టారు.

గత పీసీసీ కమిటీలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉండగా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని రిపీట్ చేసే అవకాశాలున్నట్లు గాంధీభవన్‌లో జరుగుతున్న చర్చల ద్వారా తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఈ అవకాశాలు దక్కవచ్చని సమాచారం. దీనికి తోడు ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను కూడా సీనియర్ నేతలకు అప్పగించే అవకాశమున్నది. రాష్ట్ర కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, స్పోక్స్ పర్సన్స్... ఇలా అనేక కీలక పోస్టులు ఉన్నందున పార్టీకి లాయల్‌గా పనిచేస్తున్నవారికి, ఇప్పటివరకూ కష్టపడి పనిచేసినా తగిన అవకాశాలు రానివారికి అప్పగించనున్నట్లు పలువురు సీనియర్ నేతల ద్వారా తెలిసింది. దసరా పండగ తర్వాత జిల్లా పర్యటనలు ఉంటాయని, ఆ తర్వాత కమిటీల కూర్పుపై స్పష్టత వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఇప్పటికే మీడియాకు వివరించారు. దీపావళి పండగ నాటికి ఒక స్పష్టత రావచ్చని తెలిసింది.

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా అలాంటి అవకాశాలు రాకపోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారిపై ఇప్పటికీ పీసీసీ చీఫ్ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. వారికి సంస్థాగతంగా బాధ్యతలు అప్పజెప్పాలని ఆలోచిస్తున్నారు. కొన్న చోట్ల బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు, స్థానికంగా ఆ నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్నవారికి మధ్య ఉన్న గ్యాప్‌పై గత కొన్ని రోజులుగా పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా పార్టీ నేతలు విడిపోయి ఉండడం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న పీసీసీ చీఫ్... ఈ అగాధాన్ని తగ్గించి రెండు వర్గాలూ పార్టీకి ఉపయోగపడేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. గ్రూపు తగాదాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఇలాంటి గ్యాప్, వైరుధ్యాలు ఉన్నట్లు ఆయనకు స్పష్టమైన సమాచారమే ఉన్నది. జిల్లాల పర్యటన సందర్భంగా ఈ విభేదాలను చక్కదిద్దడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవారికి ఇప్పటివరకూ అవకాశాలు రాకపోవడంతో భవిష్యత్తులో కచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పోస్టుల్ని కట్టబెట్టారు. ఇంకొందరికి కూడా అలాంటి కీలక పదవులు ఇవ్వాలని భావించారు. దసరా పండగ సమయానికి ప్రకటించాలని అనుకున్నా హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల కారణంగా ఆ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. త్వరలోనే ఫైనల్ చేసేందుకు వీలుగా జాబితా రెడీగా ఉన్నా ఏఐసీసీ నేతలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ భావించారు. మరోవైపు పార్టీ కమిటీల్లో సీనియర్ నేతలతో పాటు లాయల్‌గా ఉన్నవారికి తగిన ప్రయారిటీ ఇవ్వాలిన ఇద్దరూ భావిస్తున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాలతో కమిటీల కూర్పు జరగనున్నది. అప్పటికీ అవకాశాలు రానిపక్షంలో కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చి పార్టీ నేతలను సంతృప్తి పర్చాలని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల పర్యటన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానున్నది.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చిత్తశుద్ధితో కృషి చేసి పార్టీ గెలుపు కోసం కష్టపడినవారిని పీసీసీ చీఫ్ ఇప్పటికే గుర్తించారని, వారికి రానున్న రోజుల్లో తగిన అవకాశాలు వస్తాయని గాంధీభవన్‌లో ఇటీవల జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం కులగణన ప్రక్రియ మొదలై అరవై రోజుల్లో ముగియనున్నందున ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కమిటీల్లో కొందరు సీనియర్లకు చాన్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. రెండు జిల్లాల్లో పర్యటన ముగిసినందున మరో ఎనిమిది జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై పీసీసీ చీఫ్ స్పష్టమైన అభిప్రాయానికి రానున్నారు. ఆ తర్వాత కమిటీల కూర్పులో ఎవరికి అవకాశాలు దక్కుతాయనేది దీపావళి పండగ నాటికి క్లారిటీ రావచ్చని గాంధీభవన్ వర్గాల సమాచారం. రాష్ట్ర స్థాయి కమిటీ కూర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే కాక వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మేలు జరిగేలా ఉంటుందని ఆ వర్గాల సమాచారం.

ఇప్పటికే పార్టీలో కీలక పదవుల కోసం అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు మొదలయ్యాయి. జిల్లా స్థాయి కమిటీ (డీసీసీ) పదవుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేట్ లెవల్ కమిటీ ఖరారైన తర్వాత జిల్లా కమిటీలపై పీసీసీ చీఫ్ దృష్టి సారించనున్నారు. పది నెలల్లో పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన ఫలాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని పీసీసీ చీఫ్ సహా ముఖ్యమంత్రి కూడా పిలుపునిచ్చారు. పనిగట్టుకుని ప్రతిపక్ష పార్టీల నేతల విమర్శలను తిప్పికొట్టాలని కూడా కోరారు. కమిటీల కూర్పు సమయంలో పనితీరు ఆధారంగా (గతంలోని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించిన తీరు) రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత లభించే అవకాశమున్నది.

Advertisement

Next Story

Most Viewed