మళ్లీ టీఆర్ఎస్‌? కాకరేపుతున్న పార్టీ పేరు మార్పు ఇష్యూ!

by Rajesh |
మళ్లీ టీఆర్ఎస్‌? కాకరేపుతున్న పార్టీ పేరు మార్పు ఇష్యూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మళ్లీ తెరమీదకు వస్తోంది. కేడర్, నేతల నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో పటాన్‌చెరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాను మెడలో వేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. యాదృశ్చికమా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పేరు మార్పుతో తెలంగాణ అస్థిత్వం దూరమైందని లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి పార్టీ కేడర్‌లో నెలకొంది.

భారత రాష్ట్ర సమితి ​పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్‌​గా మార్చాలనే అంశం తెరమీదకు వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికి పార్టీ పేరు మార్చడం ప్రధాన కారణంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగిన పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్‌ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని కార్యకర్తలు, నేతలు పేర్కొంటున్నారు.

ఇదే అంశాన్ని పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లోనే అభిప్రాయాలను కేడర్ వెల్లడించింది. అంతేకాదు ప్రజల్లోనూ బీఆర్ఎస్ తమది కాదనే భావన సైతం ప్రజల్లో నెలకొంది. బీఆర్ఎస్‌​గా మారిన తర్వాత అంతగా పార్టీకి కలిసి రాలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్ద కూడా పలువురు లీడర్లు ప్రస్తావించినట్టు సమాచారం.

టీఆర్ఎస్ కండువా వేసుకున్న హరీశ్‌రావు

కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు పటాన్‌చెరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు తన మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా బదులుగా టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా వేసుకున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఆ కండువాను వేసుకోవడం పార్టీ పేరు మార్పునకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. యాదృశ్చికంగా వేసుకున్నారా? లేకుంటే కావాలనే వేసుకున్నారా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికీ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్​ పార్టీ ఉండాలనుకుంటే, దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాల కోసం టీఆర్ఎస్‌​ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆలోచించాలని నేతలు కోరుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పార్టీకి దూరం కావడంతోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే చర్చ జరిగింది.

పేరు మార్పుపై వినోద్, శ్రీనివాస్‌గౌడ్‌ల కామెంట్స్

పార్టీ పేరుమార్పుపై వారం రోజుల క్రితం మానకొండూరులో జరిగిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ పేరు మార్పులో తాను కూడా పాత్రధారినేనని, పార్టీ అధినేత కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో బీఆర్ఎస్‌కు ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో తాము ఇక నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్ పేరుతో పిలవమని టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పేరును పిలుస్తామని అన్నారు. దీంతో త్వరలోనే పార్టీ పేరు మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? అనే చర్చ గులాబీ శ్రేణుల్లో మొదలైంది.

పేరు మార్చాలని మెజార్టీ లీడర్ల డిమాండ్!

ఇప్పటికే పార్టీ పేరు బీఆర్ఎస్‌గా కొనసాగుతుందని, తిరిగి టీఆర్ఎస్‌గా కొనసాగించే అవకాశమే లేదని పార్టీ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లోనూ స్పష్టం చేశారు. కేటీఆర్ సైతం పార్టీ పేరు మార్పు జరుగదని, పేరు మార్పుతో ఓడిపోయామనేది భ్రమ మాత్రమేనని పేర్కొన్నారు. కానీ కార్యకర్తలు, లీడర్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాకే పార్టీకి కష్టాలు వచ్చాయని, పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసేశారో అప్పటి నుంచే ప్రజల్లో గుర్తింపు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ అస్థిత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు, పార్టీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌ పార్టీగా మారుస్తారా? లేదా? అనేది చర్చకు దారితీసింది. పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది నేతల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత గడ్డుకాలం నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్‌గా పేరు మార్పు ఒక్కటే అని మెజార్టీ నేతల నుంచి వినిపిస్తున్న డిమాండ్.

ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన?

టీఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆరేండ్ల పాటు ఫ్రీజ్‌లో పెట్టారు. అయితే పార్టీ పేరు మార్చాలని నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ పేరు మార్చుటకు అనుసరించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైనట్టు తెలిసింది. పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ అధిష్టానం నుంచి పలు వివరణలు కోరే అవకాశముందని, అందుకు అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. 2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్‌గా పేరు మార్చారు.

Advertisement

Next Story

Most Viewed