KCRవి పగటి కలలు.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

by Rajesh |
KCRవి పగటి కలలు.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఫామ్ హౌస్‌కు పంపించినా కేసీఆర్ బుద్ధి మారలేదన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి జనం లాగి పడేసినా సిగ్గు రావడం లేదన్నారు. ఫామ్ హౌస్‌లో చెట్ల కింద సేద తీరుతూ పగటి కలలు కంటున్నాడన్నారు. చేసేందుకు పనిలేక తనకుంటూ మరో ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడని సెటైర్లు వేశారు. బాద్ షా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌లా కేసీఆర్ తీరు ఉందన్నారు.

ఊహ లోకాన్ని సృష్టించుకొని తాను లేకపోతే తెలంగాణ లేదన్న భ్రమలో ఉన్నాడన్నారు. తాను సీఎం సీటు నుంచి దిగిపోయాక తెలంగాణ ప్రజలు అన్నం, నీళ్లు మానేసి కంటికి ధారలా విలపిస్తున్నారని చంద్రశేఖర్ రావు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. తమ అధికారం పోగానే రాష్ట్రంలో కరెంటు, నీళ్లు మాయం అయ్యాయని తనకు తాను ఊహించుకుంటున్నాడని మండిపడ్డారు. పాలిచ్చే బర్రెను వదిలి జనం దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ బలుపు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు ఎందుకూ పనికి రాని దున్నపోతును తన్ని తరిమేసి కామధేనువు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాలని సూచించారు.

Next Story

Most Viewed