- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Padma Awards: పద్మ అవార్డుల్లో రాష్టానికి అన్యాయం..! సీఎం రేవంత్ అసంతృప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: సేవా, కళలు, వైద్య రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘పద్మ’ అవార్డుల పేరుతో సత్కరిస్తున్నది. దేశానికి స్వాత్రంత్యం వచ్చిన తొలి నాళ్ల నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంపై మొదటినుంచి వివక్ష కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొదటగా పెండ్యాల సత్యనారాయణ రాజు (సివిల్ సర్వీస్)కు 1954 పద్మ భూషణ్ లభించింది. ఆ తర్వాత 1957లో ఆత్మరాం రాంచంద్ (సివిల్ సర్వీస్)కు పద్మశ్రీ లభించింది. అప్పటి నుంచి పలువురికి రాష్ట్ర జాబితాలో అవార్డులు వస్తున్నా.. అందులో చాలా మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.
రాష్ట్రంపై వివక్ష!
1993 నుంచి 1997 వరకు కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించినా.. అందులో తెలంగాణకు ఒక్కటి కూడా దక్కకపోవడం విచారం. అనంతరం 1998 నుంచి 2017 వరకు వరుసగా రాష్ట్రం కోటాలో అవార్డులు లభించాయి. 2001లో అత్యధికంగా 11 మందికి పురస్కారాలు దక్కాయి. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 14 మందికి పద్మ విభూషణ్ ఇచ్చినట్టు కేంద్రం అధికారికంగా చెబుతున్నది. ఇందులో కాళోజీ నారాయణరావు, రావి నారాయణ రెడ్డి, అబ్దుల్‌కలాం, జాకీర్‌హుస్సేన్, పద్మజా నాయుడు, రామోజీరావు, అక్కినేని నాగేశ్వర్రావు, యాగ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ గవర్నర్రంగరాజన్తదితరులున్నారు. 34 మందికి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం చెబుతుండగా.. అందులో సి.నారాయణ రెడ్డి, సీహెచ్ హన్మంతరావు, నూకల చిన్నసత్యనారాయణ, అక్కినేని నాగేశ్వర్రావు, చిరంజీవి, కృష్ణ, రామానాయుడు, వరప్రసాద్‌రెడ్డి, బోయి బీమన్న, పీవీ సిందు, చిన్న జీయ్యర్ స్వామి, భారత్బయోటెక్కృష్ణ, సుచిత్ర ఎల్లా, రెడ్డి ల్యాబ్స్‌అంజిరెడ్డి, జీవీకే రెడ్డి, సైనా నేహ్వాల్ తదితరులున్నారు. 121 మందికి పద్మ శ్రీలు వచ్చాయి. తెలంగాణ వారికే ఈ అవార్డులు ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. వీరిలో మెజార్టీ గ్రహీతలు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డుల్లో ఆంధ్ర, రాయలసీమకు చెందిన వారికే అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ 121 మందిలో సగం సైతం మన రాష్ట్రానికి చెందిన వారు లేరని తెలంగాణ వాదులు చెబుతున్నారు. ఆంధ్రలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని సైతం తెలంగాణ వారిగా చూపించారు.
రెండు భారతరత్నలు
తెలంగాణ కోటా కింద 1963లో జాకీర్హుస్సేన్కుకేంద్రం భారతరత్నను ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు 2024లో భారతరత్నను ప్రకటించినా.. వీరిలో జాకీర్ హుస్సేన్ తెలంగాణకు చెందినవారు కాదు. కానీ కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ మాత్రం జాకీర్ హుస్సేన్ సైతం తెలంగాణకు చెందినవారే అన్నట్టుగా చూయిస్తుండటం గమనార్హం.
తాజాగా రాష్ట్రం సిఫార్సు చేసిన కళాకారుల లిస్టు..
ఈ ఏడాది పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి వారి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం మాత్రం ప్రభుత్వ సిఫార్సును పరిగణలోకి తీసుకోలేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు, ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం కల్పించడానికి, పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే వారిని లెక్కలు వేసి మరీ ఎంపిక చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్‌ను పట్టించుకోరా?
తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రత్యేక తెలంగాణ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్జయశంకర్కు ఇప్పటి వరకు పద్మ అవార్డు దక్కలేదు. ఆయన కాకతీయ వర్సిటీ వీసీగా పనిచేశారు. ఇఫ్లూ సెంట్రల్ వర్సిటీలో రిజిస్ట్రార్‌గానూ సేవలందించారు. విద్యావేత్తగా, సామాజిక సమస్యలపై స్పందించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షల కోరకు పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ సమాజంలో ఆయనకు గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వం ఆయనన పేరును అవార్డు కోసం సిఫార్సు చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
దాశరథి, గద్దర్.. ఇతర కళాకారులకూ..
దాశరథి కృష్ణమాచార్యకు పద్మ అవార్డులు దక్కలేదు. ఈ ప్రాంత వాసిగా తెలుగు సాహిత్యంలో ఆయని కృషి ఏనలేనిది. గాయకుడిగా అత్యంత ప్రజాధారణ కలిగిన వారిలో గద్దర్ ప్రముఖులు. ప్రజాగాయకుడిగానూ గుర్తింపు పొందారు. ఎంతో మందిని కళాకారులుగా తయారు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన పాటలే ఊపిరిపోశాయి. అలాంటి గద్దర్‌కు కేంద్ర పురస్కారం దక్కలేదు. ఇక సినిమా రంగంలో సేవలందించిన బి.నర్సింగరావు, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, చుక్క సత్తయ్య, చిందు ఎల్లమ్మ, కవాలిలో హైదరాబాద్బ్రదర్స్, సాహిత్యంలో కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, శివారెడ్డి, కాపు రాజయ్య, ఏలే లక్ష్మణ్, ఎన్.గోపి, హన్మండ్ల భూమయ్య లాంటి వారు ఎందరో పద్మ అవార్డులకు అర్హత ఉన్న వాటిని పొందలేకపోయారు.
దూరవిద్య పితామహుడు గడ్డం రాంరెడ్డి..
డిస్టెన్స్ఎడ్యుకేషన్ పితామహుడిగా పిలవబడే గడ్డం రాంరెడ్డి (జి.రాంరెడ్డి) కరీంనగర్జిల్లా మైలారం గ్రామానికి చెందిన వ్యక్తి. ఓపెన్‌యూనివర్సిటీ, డిస్టెన్స్ఎడ్యుకేషన్కు ఆయనే ఆధ్యుడు. ఆయన ఆలోచనల వల్లే కోట్లాది మంది విద్యకు దూరమైన వారు ఉన్నత విద్యనభ్యసించి మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఓపెన్వర్సిటీని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఆయనే దానికి మొదటి వీసీ. అదే ఇపుడు అంబేడ్కర్ఓపెన్ యూనివర్సిటీగా పేరొందింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 1985లో ఇందిగాగాంధీ నేషనల్ఓపెన్యూనివర్సిటీ వీసీగా నియమించింది. ఓయూలో ఆయన పేరు మీదుగా డిస్టెన్స్ఎడ్యుకేషన్ సెంటర్నడుస్తున్నది. అంబేడ్కర్ఓపెన్ వర్సిటి రోడ్డుకు రాంరెడ్డి మార్గ్‌గా నామకరణం చేశారు. కానీ తెలంగాణకు చెందిన ఈ విద్యావేత్తకు సైతం పద్మ పురస్కారం దక్కలేదు.
ఆస్కార్ దక్కినా.. పద్మ పురస్కారం రాలే..
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్దక్కించుకున్న వారికి పద్మ అవార్డు దక్కడకపోవడం నిజంగా బాధకరమైన విషయం. ఉమ్మడి వరంగల్జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం చల్లిగరిగే గ్రామానికి చెందిన సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ప్రపంచ వేదిక మీద ఆస్కార్అవార్డు లభించింది. కానీ, పద్మ పురస్కారం మాత్రం రాలేదు.
సీఎం రేవంత్ అసంతృప్తి
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు చాలా ఏండ్లుగా అన్యాయం జరుగుతున్నా ఏ సీఎం బహిరంగంగా ప్రకటన చేయలేదు. వివక్షను ప్రశ్నించలేదు. కేంద్రాన్ని నిలదీయలేదు. కానీ, తొలిసారి కేంద్రం నిర్ణయాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించడంతో పాటు అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన వారి పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం నిజం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను పద్మ పురస్కారాలకు గుర్తించకపోవడం తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 139 మందికి అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం ఐదు పురస్కారాలు ఇవ్వకపోవడంపై రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.