మత రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ

by Sridhar Babu |
మత రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ
X

దిశ, ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ మతపరమైన రాజకీయాలతో, నియంతృత్వ పోక‌డ‌ల‌తో దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర క‌నీస వేత‌న స‌ల‌హా బోర్డ్ చైర్మ‌న్, జైబాపు జైభీం జైసంవిధాన్ ఇంచార్జి జ‌న‌క్ ప్ర‌సాద్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన జైబాపు జైభీం జైసంవిధాన్ జిల్లా స‌న్నాహ‌క స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవ‌లం మతపరమైన పార్టీ అన్నారు. అభివృద్ధిని మ‌రిచి మ‌తాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌డ‌మే నైజంగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని విమ‌ర్శించారు. భార‌త ర‌త్న డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జ‌రుగుతోంద‌ని, దాన్ని అడ్డుకుని తీరాల‌న్నారు. బీజేపీ కబంధహస్తాల కింద దేశం నలిగి పోకుండా కాపాడటం కోసం రాజ్యాంగ ప‌రిర‌క్షణే ధ్యేయంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదంతో ప్ర‌తి ఒక్క‌రం ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు. భారతీయ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిదని అన్నారు.

సమసమాజ నిర్మాణం కోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగువేల కిలోమీటర్ల యాత్ర చేపట్టార‌ని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీ బ‌లోపేతం కోసం ప్ర‌తి నాయ‌కుడు, కార్య‌క‌ర్త ప‌ని చేయాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన సాగుతోంద‌ని, రాజ్యంగ‌ ప‌రిర‌క్షణ‌ నినాదంతో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కోరారు. అనంత‌రం అంద‌రి చేత జైబాపు జై భీం జైసంవిధాన్ ప్ర‌తిజ్ఞ ప్ర‌తుల‌ను ఆవిష్క‌రించి, అంద‌రి చేత ప్ర‌తిజ్ఞ చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ మహిళా నాయకురాలు కంది సాయి మౌనా రెడ్డి, జిల్లా కోఆర్డినేట‌ర్ దుర్గం భాస్క‌ర్, ఏఐసీసీ స‌భ్యులు న‌రేష్ జాద‌వ్, ఆత్రం సుగుణ, బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గ‌జేంద‌ర్, నాయ‌కులు దిగంబ‌ర్ రావు పాటిల్, గోక గ‌ణేష్ రెడ్డి, గుడిప‌ల్లి న‌గేష్, మునిగెల న‌ర్సింగ్, లోక ప్ర‌వీణ్ రెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర్, భూపెల్లి శ్రీ‌ధ‌ర్, మాజీ కౌన్సిల‌ర్లు పాల్గొన్నారు.

Next Story