సొంత పార్టీలోనే వ్యతిరేకత.. కల్వకుర్తిని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే విఫలం: మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

by Kalyani |
సొంత పార్టీలోనే వ్యతిరేకత.. కల్వకుర్తిని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే విఫలం: మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
X

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ, ప్రోటోకాల్ విధానాన్ని అమలుపరచడంలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విఫలమయ్యారని అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు ధ్వజమెత్తారు.

మంగళవారం కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామ శివారులో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే, ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి మాత్రం నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు.

ప్రధాని మెడలు వంచి జాతీయ రహదారులు తెచ్చామని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ నియోజకవర్గానికి వచ్చి మంత్రులు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని ఎమ్మెల్యే ప్రధాని మెడలు వంచి రోడ్లు తెచ్చామంటే ఎవరైనా నమ్ముతారా అని చిత్తరంజన్ దాస్ ప్రశ్నించారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకుని మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. సాగునీటిని తేవడంలో ప్రధాన భూమికను పోషించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయాలని ఆయన సూచించారు. కాగా ఆయా మండలాల ఎంపీపీ న్యూస్ జడ్పీటీసీలు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. సొంత ప్రయోజనాలకు మినహాయిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ఆరోపించారు.

ప్రోటోకాల్ విధానాలు పాటించకుండా ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని అవమానపరుస్తున్నారని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికలలో జైపాల్ యాదవ్ కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన నాయకులు, పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికీ ఇచ్చినా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని ఎమ్మెల్సీ కసిరెడ్డి చెప్పారు.

Advertisement

Next Story